RTC Luxury Bus Travel Turns Miserable: ఆర్టీసీలో అధ్వాన ప్రయాణం
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:15 AM
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’’ బస్సులో కూర్చోగానే ఎదురుగా కనిపించే నినాదమిది. అయితే, నిర్వహణ లోపం వల్ల ఆర్టీసీ బస్సులో ....
లగ్జరీ బస్సుల్లో మూసుకోని కిటికీలు.. లహరి సర్వీసులో చిరిగిన దుప్పట్లు
చలి గాలితో ప్రయాణికులు గజ గజ
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’’ బస్సులో కూర్చోగానే ఎదురుగా కనిపించే నినాదమిది. అయితే, నిర్వహణ లోపం వల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణ అనుభూతి అధ్వానంగా ఉంటోంది. ముఖ్యంగా తీవ్రమైన చలి వేధిస్తోన్న ఈ వాతావరణంలో బస్సుల కిటికీలు మూసుకోక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. డబ్బులు ఎక్కువ వెచ్చించిన లహరి సర్వీసుల్లో చిరిగిన దుప్పట్లను ఇస్తుండటం ప్రయాణికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక్కసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే.. జలుబు, జ్వరంతో రోజుల తరబడి ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. సుదూర ప్రయాణంలో ప్రయాణికులు మందులు వేసుకోవాలన్నా, గొంతు తడుపుకోవాలన్నా.. నీళ్ల కోసం బస్సులో సిబ్బందిని నోరు తెరిచి అడగడం లేదా బస్టాండ్‌లో ఆగినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు తరచూ ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగతా రూట్లలోనూ ఆర్టీసీ సిబ్బంది తీరు ఇదే విధంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపర్ లగ్జరీ బస్సుల్లో కిటికీలు మూసుకోకపోవడంతో రాత్రి వేళ ప్రయాణికులు గజ గజ వణుకుతున్నారు. ఇక లహరి స్లీపర్ బస్సుల్లో చిరిగిన, నాసిరకం దుప్పట్లను సరఫరా చేస్తున్నారు. స్లీపర్ బస్సుల్లో దుప్పట్ల సరఫరా బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినా.. ఆర్టీసీ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. కానీ అడిగేవారు లేకపోవడంతో ఏజెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రూట్లల్లో అసలు దుప్పట్లు సరఫరా చేయలేని పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో మూడు రకాల దుప్పట్లు ఉంటాయి. ఒకటి బస్సు మొదలైన చోటు నుంచి ఉపయోగించేందుకు, రెండోది తిరుగు ప్రయాణంలో వాడేందుకు, మరొకటి అత్యవసరంగా వాషింగ్ నుంచి దుప్పట్లు అందకపోతే ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. కానీ చాలా వరకు బస్సుల్లో ఒకే దుప్పటిని ఉతకకుండానే తిరిగి ఉపయోగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. కొన్ని గరుడ, లహరి బస్సుల్లో చార్జింగ్ పాయింట్లు పనిచేయడం లేదు. మరి కొన్ని బస్సుల్లో వైరింగ్ సమస్య వల్ల మొత్తం ప్లగ్ పాయింట్లలో కరెంటు రావడం లేదు. కొన్ని బస్సుల్లో టీవీలు రావు, మరికొన్ని బస్సుల్లో సౌండ్ సిస్టం సరిగా పనిచేయదు. ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటేనే ఒకటికి, రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వాటర్ బాటిల్‌కూ తప్పని గోస..
గరుడ, లహరి బస్సుల్లో టికెట్‌తో కలిపి వాటర్ బాటిల్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. కానీ కొన్ని బస్సుల్లో వాటర్ బాటిల్ ఇవ్వడం లేదు. ఈ విషయం తెలియని చాలా మంది ప్రయాణికులు బస్సు మార్గమధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నారు. బస్సుల్లో మంచి నీరు అందివ్వడంతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం అటెండర్ ఉంటాడు. అటెండరు లేని బస్సుల్లో డ్రైవర్ నీళ్ల సీసా అందివ్వాలి. ఇలా అందించినందుకుగాను డ్రైవర్‌కు ఒక బాటిల్‌కు కొంత మొత్తం సంస్థ చెల్లిస్తుంది. కానీ చాలా బస్సుల్లో వాటర్ బాటిల్ ఇవ్వడం లేదు. వాటిని సిబ్బంది సొంతంగా వాడుకుంటున్నారు. కొందరు డ్రైవర్లు రాత్రి బస్సు అద్దాలు తుడిచేందుకు ఈ వాటర్ బాటిళ్లను వాడుతున్నారు.
దిద్దుబాటుకు ఆదేశాలు..
బస్సుల్లో సౌకర్యాల లేమితో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వాటర్ బాటిళ్లు ఇవ్వకపోవడం, చిరిగిన దుప్పట్ల సరఫరాపై డిపో మేనేజర్లు, ఆర్‌ఎంలకుఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
తాజా ఉదాహరణలు...
డిసెంబరు 15న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిన సంగారెడ్డి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కిటికీ అద్దాలు సరిగా మూసుకోలేదు. సగానికిపైగా అద్దాలు రాత్రివేళ తెరిచే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డిసెంబరు 16న తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన లహరి స్లీపర్ బస్సులో కొందరు ప్రయాణికులకు చిరిగిన దుప్పట్లు ఇచ్చారు. అంతే కాదు ఆ బస్సులో ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు ఇవ్వలేదు.