ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:27 AM
మహాత్మగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించి, విస్తరించాలని సీపీఎం జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ డిమాండ్ చేశారు. మట్టి తట్టలు ఎత్తి వంద రోజుల ఉపాధితో మహిళలంతా కుటుంబాన్ని పోషించుకుంటుంటే..
కేంద్రం వైఖరిపై బృందాకారత్ నిప్పులు.. ఘనంగా ప్రారంభమైన 14వ జాతీయ మహాసభలు
కదం తొక్కిన మహిళాలోకం
ఐద్వా సభల వేదికగా పోరాట గర్జన
26రాష్ట్రాల ప్రతినిధులతో భారీ ర్యాలీ
హైదరాబాద్/రాంనగర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మహాత్మగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించి, విస్తరించాలని సీపీఎం జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ డిమాండ్ చేశారు. మట్టి తట్టలు ఎత్తి వంద రోజుల ఉపాధితో మహిళలంతా కుటుంబాన్ని పోషించుకుంటుంటే.. ఆ ఉపాధినే రద్దు చేసే ప్రయత్నంలో కేంద్రం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాన్ని చేజారిపోనివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరున్న ఆర్టీసీ కళ్యాణమండపంలో (కామ్రేడ్ సరోజినీ బా లానందన్, కామ్రేడ్ చంద్రకళ పాండే హాల్)లో ప్రారంభమైన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆమె ప్రసంగించారు. మిత్రులారా.. సోదరులారా.. అంటూ తెలుగులో మాట్లాడుతూ మహిళల్లో ఉత్సాహం నింపారు. పాలస్తీనా, వెనెజువెలా వంటి దేశాల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం ప్రకటించారు.మహిళలపై జరుగుతున్న హింస, రాజకీయ అణిచివేత, సామాజిక, ఆర్ధిక అన్యాయాలకు వ్యతిరేకంగా ఐద్వా చేస్తున్న పోరాటాన్ని బృందాకారత్ వివరించారు.ఈ నెల 28 వరకు జరుగనున్న ఈ ఐద్వా మహాసభల్లో.. 26 రాష్ట్రాల నుంచి సుమారు 850 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. మొదటిరోజు ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె శ్రీమతి జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమవగా, ప్రముఖ సినీనటి, రచయిత రోహిణి మొల్లేటి ప్రారంభోపన్యాసం చేశారు.
ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి: రోహిణి.ఎం
సమానత్వం అనేది మన ఇళ్ల నుంచే ప్రారంభం కావాలని సినీనటి రోహిణి ఆకాంక్షించారు. ‘‘ఆకాశం వైపు చూస్తే మార్పురాదు. పోరాడితేనే మార్పు సాధ్యం. మహిళల హక్కుల్ని ఎవరో నిర్ణయించడం కాదు. మనమే నిర్ధారించుకోవాలి. కట్నకానుకలు ఇవ్వడం, తీసుకోవడం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇళ్ల నుంచే మొదలవ్వాలి’’ అని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్రను ఈ సందర్భంగా రోహిణి కొనియాడారు.
మహిళా ఓట్లపై కేంద్రం కుట్ర: పి.కె. శ్రీమతి
బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో 25 లక్షలకు పైగా మహిళా ఓటర్ల పేర్లను కేంద్రం అక్రమంగా తొలగించిందని ఐద్వా జాతీయ అఽధ్యక్షురాలు పి.కె శ్రీమతి ఆరోపించారు. ప్రారంభసభ అధ్యక్షోపన్యాసంలో కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌లో.. నేటికీ మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడం శోచనీయమన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఏకంచేసి విప్లవాత్మక పోరాటాలకు నాయకత్వం వహించిన మల్లు స్వరాజ్యం స్ఫూర్తిగా నూతనోత్తేజం పొందాలని ఐద్వా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా సభలో ధావలే, శాంత సిన్హా సహా పలు రాష్ట్రాలకు చెందిన వక్తలు తమ సందేశాలను ఇచ్చారు.
ఐద్వా మహిళల భారీ ర్యాలీ
ఐద్వా మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీక్రాస్ రోడ్ సమీపంలోని బస్‌భవన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభతో ర్యాలీ ముగిసింది. 26రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 850మంది ప్రతినిధులు ఒకే రకమైన వస్త్రధారణతో ర్యాలీలో పాల్గొనడం ఆకట్టుకుంది. ‘ఐద్వా జిందాబాద్’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఈ ర్యాలీలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి, సినీనటి రోహిణి, రామన్ మెగసేస్ అవార్డు గ్రహీత శాంతాసిన్హా, మాజీ ఎంపీ బృందా కారత్, తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.