Share News

BRDS Walkout: మూసీ కంటే రేవంత్‌ మాటల కంపే ఎక్కువ!

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:45 AM

మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువైపోయిందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు అన్నారు.

BRDS Walkout: మూసీ కంటే రేవంత్‌ మాటల కంపే ఎక్కువ!

  • ముందు ఆయన నోటిని ప్రక్షాళన చేయాలి.. సభను స్పీకర్‌ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు

  • జవాబు చెప్పలేక ఎదురుదాడి:హరీశ్‌

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువైపోయిందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు అన్నారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు రేవంత్‌రెడ్డి నోటిని ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు. సభను స్పీకర్‌ ఏకపక్షంగా నడుపుతున్న తీరుకు, సీఎం రేవంత్‌రెడ్డి అసభ్యకర ప్రవర్తనకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసిన అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గన్‌ పార్క్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. అవినీతికి అధికారికంగా ధరలు నిర్ధారించి మరీ పెంచిన రేవంత్‌కు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సభలో స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుకు, ప్రభుత్వ అహంకార పూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని చెప్పారు. సభలో బాడీ షేమింగ్‌ చేసి మాట్లాడుతూ సీఎం వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని, అసెంబ్లీని సీఎల్పీ మీటింగ్‌లా, గాంధీ భవన్‌లా మార్చేశారని ఆరోపించారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్లే సొల్లు వాగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌పై సీఎం వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డే అసలైన తెలంగాణ ద్రోహి, నీటి ద్రోహి అని విమర్శించారు. బీఏసీ సమావేశానికి గంటన్నర సేపు నిరీక్షించేలా చేసి, తమ అవమానించారని చెప్పారు. ఆ సమావేశంలో సభను 7 రోజులపాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్‌ నిర్ణయిద్దామని అనుకున్నామని తెలిపారు. సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్నిరోజులు నడపాలనేది స్పీకర్‌ నిర్ణయానికే వదిలేసినట్లు తప్పుడు సమాచారం పొందుపరిచారన్నారు. స్పీకర్‌ సభను ఏకపక్షంగా నడుపుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల మైక్‌ కట్‌ చేయడం సరికాదని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్‌ విమర్శించలేదా? ఇక్కడ తాము సీఎంను ప్రశ్నిస్తే మైక్‌ ఎందుకు ఆపేస్తున్నారు? అని హరీశ్‌ ప్రశ్నించారు. సీఎంను విమర్శించొద్దని స్పీకర్‌ చెప్పడమేంటనిని నిలదీశారు. ‘మూసీపై చర్చకు మేం సిద్ధం. రోజంతా చర్చిద్దాం. కానీ, సీఎం వచ్చి గంటన్నర సేపు అడ్డగోలుగామాట్లాడితే ఎలా?’ అని ప్రశ్నించారు. మూసీలో ఇళ్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరామని, మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలను మల్లన్నసాగర్‌ నుంచి తెస్తున్నారా? అని అడిగితే జవాబు చెప్పలేక ఎదురుదాడికి దిగారన్నారు. మూసీ శుద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 32 ఎస్టీపీలను కట్టిందని చెప్పారు.


సభలో వాగ్వాదం..

శుక్రవారం శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపై నిరసనకు దిగిన బీఆర్‌ఎస్‌ సభ్యులు కొద్దిసేపటికే సభ నుంచి వాకౌట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నిరసనలతో ప్రశ్నోత్తరాలు అర్ధంతరంగా రద్దయ్యాయి. అంతకుముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. సభను నడిపించే పద్ధతి ఇదేనా? అని నిలదీశారు. ‘సీఎంకు అంత ఆవేశం ఎందుకు? కడుపులో విషం ఎవరికి ఉంది? ఏం మాట్లాడుతున్నారు?’ అని మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. సీఎం తన ప్రసంగంలో ఎవరి పేరూ ప్రస్తావించలేదన్నారు. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. కాగా, సభను 7 రోజుల పాటు నడిపించిన తర్వాత మళ్లీ బీఏసీ నిర్వహించి, సభను నడుపుతామని చెప్పారని హరీశ్‌రావు అన్నారు. కానీ, ఈ రోజు సభలో ఏం చర్చించాలనే దానిపై అజెండాను తెల్లవారుజామున 2 గంటలకు పంపించారని చెప్పారు. మూసీ కంపు కంటే సీఎం మాటల కంపే ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్పందిస్తూ.. సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం: హరీశ్‌

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని, అలాంటి పరిస్థితి వస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హరీశ్‌రావు అన్నారు. మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో మాట్లాడారు. మూసీ సుందరీకరణ పేరుతో ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కూల్చేశారో, ఇంకా ఎన్ని కూల్చాలనుకుంటున్నారో ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం 14.50 లక్షల చొప్పున ఇవ్వాలని, 200 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

తెలంగాణకు రేవంతే నంబర్‌వన్‌ విలన్‌

తెలంగాణ నీటి ప్రయోజనాలకు రేవంత్‌రెడ్డి నంబర్‌వన్‌ విలన్‌గా మారారని, ఆయన చర్యలన్నీ ఏపీ అక్రమంగా చేపట్టే నల్లమలసాగర్‌కు అనుకూలంగా ఉన్నాయని హరీశ్‌ ఆరోపించారు. కేంద్రం తాజగా ప్రకటించిన నదీ జలాల పంపిణీ కమిటీ కూర్పు చూస్తుంటే రాష్ట్రానికి సీఎం చేస్తున్న ద్రోహం స్పష్టమవుతోందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లతో కేంద్ర ప్రభుత్వ అధికారులను చేర్చి.. నీటి వాటా పంపిణీపై కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ఖరారు చేసిందని అన్నారు. నదీ జలాల పంపిణీ వంటి కీలకమైన కమిటీలో తెలంగాణ తరఫున అనుభవజ్ఞుడైన అధికారే లేకపోవడం ఆందోళనకరమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని అధికారులతో రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా నల్లమలసాగర్‌ కోసం చేస్తున్న కుట్రలా భావించాలన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 03:45 AM