Share News

యువకుడి చొరవ.. 8 ఏళ్ల చిన్నారికి తప్పిన ముప్పు

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:20 AM

ఆటోలో కూర్చున్న ఎనిమిదేళ్ల బాలిక గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని చూసిన ఆ యువకుడు తనకెందుకులే అనుకోలేదు. కారణం తెలుసుకోవాలనుకున్నాడు.

యువకుడి చొరవ.. 8 ఏళ్ల చిన్నారికి తప్పిన ముప్పు

  • అబిడ్స్‌లో స్కూల్‌ వద్ద బాలికను ఆటోలో ఎక్కించుకున్న డ్రైవర్‌

  • చిన్నారి పట్ల అసభ్యచేష్టలు... అడ్డుకున్న యువకుడు

  • ఆటో డ్రైవర్‌ అరెస్టు.. యువకుడికి సజ్జనార్‌ అభినందనలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆటోలో కూర్చున్న ఎనిమిదేళ్ల బాలిక గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని చూసిన ఆ యువకుడు తనకెందుకులే అనుకోలేదు. కారణం తెలుసుకోవాలనుకున్నాడు. ఆటో వద్దకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని ఎంతో ఆప్యాయంగా బాలికను అడిగాడు. ఆ యువకుడి ఈ చొరవే ఆ బాలికను కిడ్నాప్‌ చెర నుంచి కాపాడింది. బాలిక కోసం వెతుకుతూ గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులకు ప్రాణం లేచొచ్చేటట్లు చేసింది. బాలికను అపహరించిన ఆ ఆటోడ్రైవర్‌ కటకటాలపాలయ్యేలా చేసింది. బాలికను రక్షించిన ఆ యువకుడిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అబిడ్స్‌లో ఏప్రిల్‌-1న సాయంత్రం స్కూల్‌ వదలగానే ఇంటికి వెళుతున్న బాలిక (8)ను మెహదీపట్నం హిల్స్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ సలీం మాయమాటల చెప్పి తన ఆటో ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి బాలికను గోల్కొండలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో అక్కడి మసీదు నుంచి బయటకొస్తున్న మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే యువకుడు ఆటోలో చిన్నారి ఏడుస్తుండటాన్ని చూశాడు. అనుమానంతో ఆటో వద్దకు వెళ్లాడు. భయంతో వణుకుతూ ఏడుస్తున్న ఆ చిన్నారి.. ఇంటికి వెళుతున్న తనను ఆటోవాలా వాహనంలో ఎక్కించుకున్నాడని, తన పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని చెప్పింది. ఆ ఆటోను తోలుతున్న వ్యక్తిని ఫిరోజ్‌ నిలదీయడంతో పరారయ్యాడు. అప్రమత్తమైన ఫిరోజ్‌.. బాలిక మెడలో ఉన్న ఐడీ కార్డులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఆమె తండ్రికి సమాచారమిచ్చాడు. అప్పటికే ఆందోళనతో స్కూల్‌ దగ్గరకొచ్చి, విలపిస్తున్న బాలిక తల్లిదండ్రులను అబిడ్స్‌ పీఎస్‌ బ్లూకోట్స్‌ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్‌ సింగ్‌ చూశారు. వారి ద్వారా విషయం తెలుసుకొని.. వెంటనే గోల్కొండకు చేరుకున్నారు. బాలికను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సలీంను ఏప్రిల్‌ 2న అరెస్ట్‌ చేశారు. ఆటోను సీజ్‌ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఆపదలో ఉన్న బాలికను సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్‌ ఫిరోజ్‌ను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అభినందించారు. శాలువాతో సత్కరించి, నగదు పురస్కారం, ప్రశంసాపత్రం అందజేశారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే ఫిరోజ్‌ లాంటి యువకులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. నేరం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫిరోజ్‌ స్పందించారని ప్రశంసించారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూకోట్స్‌ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్‌ సింగ్‌ను అభినందించారు.

Updated Date - Apr 07 , 2026 | 05:20 AM