బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:17 AM
సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి తొలిపూజలతో వార్షిక బ్రహ్మో త్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు
శాస్త్రోక్తంగా విష్వక్సేనారధన, స్వస్తివాచనం
మృత్సంగ్రహణం, అంకురార్పణ పూజలు
ఆపద మొక్కుల వాడు.. నిత్యపూజలందుకునే స్వయంభువు యాదగిరి లక్ష్మీనృసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆగమశాస్త్రం ప్రకారం శ్రీకారం చుట్టారు. వేద మంత్రో చ్ఛరణలు, చతుర్వేద, ప్రబంధ పారాయణాలు వైభవంగా రుత్వికులు, పారాయణీకులు, ప్రధానార్చక బృందం నిర్వహించారు. ఉదయం సంప్రోక్షణ, పుణ్యావాచనం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షబంధనంతో శాస్త్రోక్తంగా మొదలై సాయంత్రం మృత్యంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి, యాదగిగిరిగుట్ట
సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి తొలిపూజలతో వార్షిక బ్రహ్మో త్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉత్సవ మండపంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో దివ్య మనోహరంగా అలంకరించిన స్వామి వారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. ఉత్సవాలు నిర్విగ్నంగా సాగేం దుకు నిర్దేశించిన మంత్రోచ్చరణలతో తొలిపూజలు నిర్వహించారు.
పుణ్యాహవాచనం.. సంప్రోక్షణ
ఆలయ పరిసరాలు ఽశాస్త్రోక్తంగా శుద్ధి చేసేందుకు పుణ్యావాచన పూజలు నిర్వహించారు. మండపంలో విశేష అలంకారంతో లక్ష్మీనరసింహుల ఎదుట పంచామృత కలశాలకు, దర్భ(గరక)లతో పూజలు నిర్వహించారు. ఆలయ మండపానికి తెచ్చిన పూర్ణకుంభ కలశ జలాలను మంగళవాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేసి పుణ్యజలాలుగా సంప్రాప్తి కల్పించారు. అంతరాయంలోని స్వయంభువుమూర్తులకు నిజాభిషేకం నిర్వహించిన తర్వాత ఆలయ మండపం, పరిసరాలు, కొండపై నలుదిక్కుల మంత్రించిన పవిత్ర జలాన్ని చిలకరిస్తూ పుణ్యావాచనం కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు
వార్షిక బ్రహ్మోత్సవాలకు గర్భాలయంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవ దీక్ష సంకల్పానికి కంకణాలకు ప్రత్యేకంగా పూజలు జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో వివిధ సేవల్లో ఊరేగించే ఆగమశాస్త్రానుసారంగా ఉత్సవమూర్తులతో పాటు మూలవరులకు రక్షబంధన చేశారు. అనంతరం దీక్షాబద్దులను చేస్తూ ఈవో జే. భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహ మూర్తి దంపతులు, ముఖ్యమైన అధికారులకు కంకణ ధారణ చేశారు. పూజా కార్యక్రమా లను ప్రధానార్చకులు కాండూరి వెంకటా చార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు అర్చక బృందం నిర్వహిం చగా కలెక్టర్ ఎం. హనుమంతరావు, అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్‌రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈ వోలు ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, గజ్వేల్లి రఘు, పర్యవేక్షకులు కలకోట సీతరామచార్యులు, కే. నటరాజు, వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చతుర్వేద.. ప్రబంధ పారాయణాలు
బ్రహ్మోత్సవ ప్రారంభం ప్రాధాన్యంతో చతుర్వేద మంత్రపారాయణాలు, ఉపనిషత్తులు, పంచసూక్తములు, శ్రీసుదర్శన శతక, రామాయణ భాగవతాలను క్షేత్ర మహాత్యం, మూలమంత్ర జపాలు చేపట్టారు. రుత్వికులు, వేద పండితులు, ఆలయ అర్చకులు పారాయణాలకు దేవస్థానం ఈవో, ఆలయ అనువంశిక ధర్మకర్త దీక్షా వస్ర్తాలు అందజేశారు.
మృత్సంగ్రహణం.. అంకురారోపణ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం కార్యక్రమాలలో మృత్సంగ్రహణం, అంకురార్పణ సంప్రదాయరీతిలో చేపట్టారు. మంత్రపూర్వకంగా భూ మాతను పూజించి పుట్టమన్ను తెచ్చి యాగశాలకు చేర్చారు. మంత్ర జలంతో పుట్టమన్నులో నవధాన్యాలు ప్రోక్షణ చేసి పాలికలు నింపారు. పవిత్రీకరించి తడిపి పాలికల్లో మొలకెత్తించే కార్యక్రమమే అంకురార్పణం. ఉత్సవాలు ముగిసే వరకు నిత్యం ఆరాధిస్తారు. పాలికల్లో వృద్ది చెందిన అంకురాలు(మొలకలు) లోక సుభిక్షతకు సూచనగా ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.
యాదగిరిగుట్టకు చేరిన అఖండజ్యోతి
హైదరాబాద్ బర్కత్‌పుర నుంచి లక్ష్మీనరసింహస్వామి అఖండజ్యోతి యాత్ర బుధవారం యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ నెల 15న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఈవో జే. భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహ మూర్తి యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వెంట సుమారు 56కిలోమీటర్ల మేర సాగిన యాత్రకు ఊరూర భక్తులు విశేషంగా హారతులు సమర్పించారు.
బ్రహ్మోత్సవ పూజల్లో వానరం
ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ రాజగోపురం ఎదురుగా రాత్రి మృత్యంగ్రహణం నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారి వానరం ప్రత్యక్షం కాగా పూజల్లో వినియోగించే అరటి పండ్లు తీసుకెళ్లింది. ఉత్సవాల మొదటి రోజున స్వయంగా క్షేత్రపాలకుడే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం శుభసూచికమని అధికారులు, అర్చకులు, భక్తులు భావించారు.
స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
స్వామివారిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. తన కూతురు జన్మదినం సందర్భంగా విప్ కుటుంబ సభ్యులతో స్వయంభువులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మెడికవర్ ఆసుపత్రి (హైదరాబాద్) భక్తులకు కొండపైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు జ్యోతిప్రజ్వలన జరిపిన ఈవో భవానీశంకర్ ప్రారంభించారు. ఈ నెల 28 వరకు వైద్య సేవలు కొనసాగనుండగా డాక్టర్ టీ. పృథ్వీ, డీఎన్‌బీ (జనరల్ మెడిసిన్), జనరల్ ఫిజిషియన్ భక్తులకు వైద్య శిబిరం నిర్వహించారు.
పోచంపల్లి చేనేత వస్త్రాల అందజేత
భూదాన్ పోచంపల్లి : వార్షిక బ్రహ్మోత్సవాలకు భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గజ్వేల్లి రఘుకు పట్టువస్త్రాలు అందజేశారు. గర్భాలయంలో బుధవారం పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో చేనేత టై అండ్ డై ఇక్కత్ పట్టువస్త్రాలు తెచ్చారు. జనవరి 23న వస్త్రాల తయారీకి వినియోగించే నూలును (వసంత పంచమి) స్వామి పాదాల చెంత వద్ద పూజలు నిర్వహించి నియమ నిష్ఠలతో వస్త్రాలను రూపొందించారు. ఈ నెల 25న జరగనున్న స్వామి కల్యాణోత్సవంలో వినియోగించేందుకు నిర్వాహకులు అప్పగించారు. వస్త్రాలు అందజేసిన వారిలో చేనేత సంఘం అధ్యక్షుడు సీతశ్రీరాములు, బోగ నర్సింహా, అంకం మురళీ, భారత బాలరత్నం, కడవేరు చంద్రమౌళి, సంగం చంద్రయ్య ఉన్నారు.