పాలమూరులో బ్రహ్మోస్!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:06 AM
అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులను తయారుచేసే యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
దేవరకద్ర నియోజకవర్గంలో 416 ఎకరాల్లో క్షిపణి తయారీ కేంద్రం
శంషాబాద్ విమానాశ్రయానికి 100 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవేకు దగ్గర్లో ఏర్పాటు.. ఒక దఫా సర్వే పూర్తి
భూసేకరణకు గత ఏడాది అక్టోబరు 24న సర్కారు మెమో
రూ.500 కోట్ల పెట్టుబడి.. రెండు వేల మందికి ఉపాధి
లఖ్‌నవూలో రూ.380 కోట్లతో మొదటి యూనిట్ ఏర్పాటు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులను తయారుచేసే యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకాల్లో భాగంగా రక్షణ శాఖ లఖ్‌నవూ (ఉత్తరప్రదేశ్)లోని యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో రూ.380 కోట్లతో ఇప్పటికే ఒక బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 2025 మే నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే రెండో యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూముల కోసం బ్రహ్మోస్ టీమ్ అన్వేషిస్తున్న నేపథ్యంలో.. ఆ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని.. అందుకు అవసరమైన భూములను ఇస్తామని సీఎం రేవంత్ ఆ బృందానికి విజ్ఞప్తి చేశారు. అందుకు బ్రహ్మోస్ టీమ్ సానుకూలంగా స్పందించింది. దరిమిలా ఈ యూనిట్‌ను.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి సంబంధించి దాదాపు అన్ని ప్రక్రియలూ ప్రాథమికంగా పూర్తయినట్టు తెలిసింది. అక్కడ ఈ యూనిట్ ఏర్పాటు నిమిత్తం సర్వే నిర్వహించిన బ్రహ్మోస్ బృందం.. ఆ ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో.. సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. డీఆర్‌డీఎల్ పరిధిలో చేపట్టే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి ఈ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్ సెంటర్’ను తొలుత హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భూముల లభ్యత తక్కువగా ఉండడంతో.. మరోచోట పెట్టాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన భూములు తమ నియోజకవర్గంలో ఉన్నట్టు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ సీఎం రేవంత్‌కు తెలియజేశారు. ప్రభుత్వం బ్రహ్మోస్ బృందానికి ఆ వివరాలను తెలపగా... శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో.. బెంగళూరు హైవేకు (ఎన్‌హెచ్-44) దగ్గరగా ఉన్న ఆ భూములను పరిశీలించిన టీమ్ సంతృప్తి వ్యక్తం చేసింది.
దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం దేవరకద్ర నియోజకవర్గంలోని చౌదరిపల్లి, బస్వాయిపల్లి, జీనుగర్ల గ్రామాల పరిధిలో 416 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2025 అక్టోబరు 24న పరిశ్రమల శాఖ మెమో (3978/ఐపీఎన్‌ఎఫ్/ఏ2/2025) జారీ చేసింది. ఆ 416 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల ప్రాథమిక పెట్టుబడి అంచనాతో.. బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో పాటు దాని అనుబంధ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీని ఏర్పాటుతో దేశ రక్షణ తయారీ రంగంలో తెలంగాణకు జాతీయ స్థాయి గుర్తింపు రానుంది. అలాగే మన రాష్ట్రంలో డిఫెన్స్ ఎకోసిస్టమ్ కూడా మరింత విస్తరిస్తుందని.. దేశ రక్షణలో తెలంగాణ వ్యూహాత్మకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు అవకాశాలూ మెరుగుపడతాయనిపేర్కొంటున్నారు.
నా నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి
బ్రహ్మోస్ బృందం ముఖ్యమంత్రితో గతంలో భేటీ అయింది. దేవరకద్రలో భూమి అందుబాటులో ఉందని సీఎంకు తెలియజేశా. సీఎం సూచనతో బ్రహ్మోస్ టీమ్ దేవరకద్రకు వచ్చి, భూమిని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవానికి సరిగ్గా ఏడాది క్రితం 2025 జూన్ 19వ తేదీనే బ్రహ్మోస్ టీమ్ దేవరకద్రకు వచ్చి వెళ్లింది. కేంద్రం అనుమతినిస్తే శంకుస్థాపనే తరువాయి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ యూనిట్ ఏర్పాటుతో దాదాపు 1500 నుంచి 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న సీఎం రేవంత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. దీనికి వేగంగా అనుమతులు ఇవ్వాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను మా నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నా. త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం.
- జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర