Share News

మొక్కజొన్నను కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:43 AM

మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు...

మొక్కజొన్నను కొనుగోలు చేయాలి

  • అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీనికంటే ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్‌ నేతృత్వంలో గన్‌పార్క్‌ వద్ద ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మొక్కజొన్న కంకులు చేతపట్టి, నినాదాలు చేస్తూ ప్రదర్శనగా అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు. దీంతో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీలోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ మార్షల్స్‌, పోలీసులు అడ్డు చెప్పారు. నేతల చేతుల్లో ఉన్న మొక్కజొన్న కంకులను లాక్కున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి గందరగోళం ఏర్పడింది. హరీశ్‌ చేతికి గాయమైంది. బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీ ద్వారం వద్దే బైఠాయుంచి నిరసన తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. గన్‌పార్కు వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారని, పంట చేతికొచ్చి 15 రోజులవుతున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదన్నారు. క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ఉంటే.. మార్కెట్‌లో దళారులు రూ.1600-1700కు కొనుగోలు చేస్తున్నారని, చేసేది లేక రైతులు అమ్ముకుంటూ నష్టపోతున్నారన్నారు. ఇలా నష్టపోయిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వాలన్నారు.

2400 మద్దతు ధర ఇవ్వాలి: కడియం

మక్కలకు రూ.2400లను కనీస మద్దతు ధరగా కేంద్రం ఖరారు చేసిందని, ఈ మేరకు పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతఏడాది కన్నా ఈసారి రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో అదనంగా మక్కలు పండించారని, 11.72 లక్షల ఎకరాల్లో పంట సాగయిందని తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేశారని, ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఙప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు కోరినంత ఎరువులు ఇవ్వాలని, ఎర్ర జొన్న పంటలను రూ.500ల బోన్‌సతో కొనుగోలు చేయాలని విజ్ఙప్తి చేశారు.

Updated Date - Mar 19 , 2026 | 04:43 AM