Share News

kumaram bheem asifabad- అటు ప్రోత్సాహకాలు..ఇటు అసౌకర్యాలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 10:59 PM

జాబ్‌ కార్డు కలిగి పని కావాలన్న ప్రతీ ఒక్కరికీ ఉపాఽధి పనులు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. లక్ష్యం నిరవేరేలా పని దినాలను పూర్తి చేసి నిధులు సద్వినియోగం చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు వీబీ జీరామ్‌జీ ఉపాధి హామీ పథకంలో కార్మికుల హాజరు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

kumaram bheem asifabad- అటు ప్రోత్సాహకాలు..ఇటు అసౌకర్యాలు
లోగో

- వేసవి ఎండలకు తీవ్ర అవస్థలు

- పని స్థలాల్లో సౌకర్యాలు కల్పించాలని వినతి

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): జాబ్‌ కార్డు కలిగి పని కావాలన్న ప్రతీ ఒక్కరికీ ఉపాఽధి పనులు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. లక్ష్యం నిరవేరేలా పని దినాలను పూర్తి చేసి నిధులు సద్వినియోగం చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు వీబీ జీరామ్‌జీ ఉపాధి హామీ పథకంలో కార్మికుల హాజరు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హాజరు నమోదు ఎక్కువగా చేసే మేట్లతో పాటు,ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నగదు ప్రోత్సాహాకాలు అందించాలని నిర్ణయించారు. అయితే హాజరు వేసే నిబంధనలు మారుతుండడంతో కూలీలు నిరుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో కూలీ రెండు సార్లు మోబైల్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసేందుకు నిబంధనలు రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కూలీలు నిరుత్సాహానికి గురయి సరిగ్గా పనులకు వెళ్లడం లేదు. దీంతో హాజరు శాతం తగ్గుతూ వస్తోంది. దీనిని నివారించి ఎలాగైనా హాజరు శాతం పెంచాలని, తద్వారా నిధులు వ్యయం చేసి అభివృద్ధి సాదించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఇద్దరు చొప్పున ఉపాధి హామీ పథకంలో హాజరు పెం చే వారికి రూ. 1000 నగదు ప్రోత్సాహం అందించ డంతో పాటు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిబ్బందికి రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా సూచనలిస్తున్నారు.

- జిల్లాలో 1.52 లక్షల మంది..

జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల మంది కూలీలుండగా, 84 వేల జాబ్‌ కార్డులున్నాయి. 15 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో వేలాది కుటుంబాలు ఉపాధి హామీ పనులు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరతున్నా రు. మంచినీరు, టెంటు నీడ, పని సామగ్రి, ప్రయాణ ఖర్చులు, మెడికల్‌ కిట్లు, ఇతర ఖర్చులు ఇవ్వాలని వినతి పత్రాలు అందిస్తున్నారు. కానీ అవి అమలు కావడం లేదు. మరో వైపు ఉన్నతాధికారులు సైతం అర్హులైన ప్రతీ ఒక్కరికి పని కల్పించాలని, 125 పని దినాలు పని ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తున్నారు. గత మూడు నెలల నుంచి కూలీలకు వేతనాలు ఇవ్వక పోవడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాను కలిసి వినతిపత్రం అందించారు. దీంతో సబ్‌ కలెక్టర్‌ ఇంఛార్జి ఎంపిడీఒ గౌరీ శంకర్‌ తీరుపట్ల అసంతృి ప్త వ్యక్తం చేసి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తాను క్షేత్ర స్థాయిలో సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

నిబంధనలతో అవస్థలు..

-ముంజం ఆనంద్‌కుమార్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌

ఉపాధి హామీ కూలీలు కొత్త నిబంధనలతో అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి మూడు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. పని ప్రదేశంలో పనిముట్లు, నీడ, మెడికల్‌ కిట్స్‌ తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రతీ ఒక్కరికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. పని ప్రదేశంలో రెండు ఫొటొలతో హాజరు వేసే విధానం తొలగించాలి. కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధు లు ఇవ్వాలి. ఈ నిధులను ఇతర పనులకు మళ్లించకుండా కూలీలకు చెందే విధంగా మార్పులు చేయాలి. ఉపాధి హామీ పథకంలో పాత నిబంధన లే కొనసాగించాలి. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన బాట పడుతాం.

Updated Date - Apr 28 , 2026 | 10:59 PM