బాస్ పేరిట బురిడీ!
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:00 AM
బాస్క్ స్కామ్! హౌస్ అరెస్టు పేరుతో అమాయకులను కొల్లగొట్టిన కేటుగాళ్లు ఎంచుకున్న కొత్త పంథా ఇది. ‘‘అర్జెంటుగా పేమెంట్ చేయాలి..
మీటింగ్‌లో ఉన్నా అర్జంట్‌గా పేమెంట్ చేయండి
బాస్ పేరుతో ఈ-మెయిల్.. సైబర్ నేరగాళ్ల కొత్తవల
నమ్మి డబ్బు పంపుతున్న ఉద్యోగులు
20రోజుల్లో దేశవ్యాప్తంగా 300 ఫిర్యాదులు
కంపెనీల సీఈఓలు, ఎండీలు, జీఎంల ఖాతాల్లోకి చొరబడుతున్న సైబర్ నేరగాళ్లు
రాష్ట్రంలో అలర్ట్ జారీచేసిన సీఎస్‌బీ
హైదరాబాద్, జూన్24 (ఆంధ్రజ్యోతి): బాస్క్ స్కామ్! హౌస్ అరెస్టు పేరుతో అమాయకులను కొల్లగొట్టిన కేటుగాళ్లు ఎంచుకున్న కొత్త పంథా ఇది. ‘‘అర్జెంటుగా పేమెంట్ చేయాలి.. డబ్బు పంపండి’’ అంటూ బాస్ పేరిట ఈ-మెయిళ్లు పంపుతూ బడా కంపెనీల ఉద్యోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ మేరు కంపెనీ ఉన్నతాధికారుల ఆన్‌లైన్ ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో చొరబడి ఆయా సంస్థల్లోని ఫైనాన్స్ విభాగానికి తాము సూచించిన ఖాతాలకు అర్జంట్‌గా డబ్బు బదిలీ చేయాలంటూ ఆన్‌లైన్‌లో ఆదేశాలిస్తున్నారు. ఇలాంటి మెయిల్స్‌ను నమ్మి ఉద్యోగులు డబ్బును బదిలీ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా గత 20 రోజుల్లో 300 ఫిర్యాదులు నమోదయ్యాయి. రంగంలో దిగిన ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఇటీవలే దేశవ్యాప్త హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) హెచ్చరికలు జారీ చేసింది.
చొరబడుతున్నారిలా...
ముందుగా ఆయా సంస్ధల సీఈవో, ఎండీ, లేదా ఉన్నతాధికారుల ఈ-మెయిల్, వాట్సాప్ ఖాతాలను మాల్‌వేర్ ద్వారా తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఆపై సమాంతర నెట్‌వర్క్ ప్రారంభిస్తున్నారు. అత్యవసర చెల్లింపులు చేయాలంటూ తమ ఫైనాన్స్ విభాగాలకు బాస్‌ల ఈ-మెయిల్ లేదా వాట్సా్‌పల నుంచి ఆదేశాలిస్తున్నారు. ఆ-మెయిల్ బాస్ నుంచే రావడం, వాట్సాప్ డీపీ కూడా బాస్ ఫొటోలే ఉండటంతో ఆర్ధిక వ్యవహరాలు చూసే ఉద్యోగులు ఏ మాత్రం అనుమానించకుండా నిమిషాల వ్యవధిలో బాస్ సూచించిన ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నారు. బాస్‌ల పేరిట పంపే ఈ-మెయిల్‌లో ఎలాంటి అనుమానాలు రాకుండా సైబర్ నేరగాళ్లు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు సంస్ధల్లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు, వ్యాపార సంస్ధల అధిపతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా మోసపూరిత ఏపీకే ఫైళ్లను పంపిస్తూ వారి ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడుతున్నారు. నిమిషాల వ్యవధిలో ఆయా సంస్ధల ఉన్నతాధికారుల పేరిట వారి డేటాలో ఉన్న కింది స్ధాయి అధికారులకు డబ్బు బదిలీ చేయాలని మెయిల్ చేస్తున్నారు. తమ బాస్‌కు చెందిన అధికారిక ఈ-మెయిల్ నుంచి సందేశం రావడంతో వారు బాస్ సూచించిన ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత తమ బాస్‌లతో ఫోన్‌లో మాట్లాడినపుడు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు సంస్ధల సీఈవోలు, ఎండీలు, జనరల్ మేనేజర్లు ఇతర ఉన్నతాధికారుల ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫార్మ్‌లలోకి చొరబడటం ఆందోళన కలిగిస్తోందని ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఇటీవలే దేశవ్యాప్త హెచ్చరికలు జారీ చేసింది. ఇదీ రెండు రకాలుగా జరుగుతున్న మోసం అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. నేరుగా బాస్ ఆన్‌లైన్ వ్యవస్ధలోకి మాల్‌వేర్ ద్వారా చొరబడటం ఒక పద్ధతి కాగా, మరో పద్ధతిలో బాస్ పేరిట పంపే సందేశాల్లో జిప్ ఫైల్స్ పంపించి ఆ ఫైళ్లను ఉద్యోగులు ఓపెన్ చేయగానే ఆయా సిస్టమ్ మీద కమాండ్ తీసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం జరుగుతోందని అధికారులు తెలిపారు.
తప్పించుకోవచ్చిలా..
బాస్ నుంచి వచ్చిన మెసేజ్ అయినా..డబ్బు పంపే ముందు ఒక్క ఫోన్ కాల్ చేసి ధ్రువీకరించుకుంటే ముప్పు తప్పించుకోవచ్చునని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే అత్యవసర చెల్లింపు ఆదేశాలను తక్షణమే అమలు చేయొద్దని, ప్రత్యక్షంగా ఆ సమాచారాన్ని నిర్ధారించుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు. ఎవరు పంపినా గుర్తు తెలియని జిప్, ఈఎక్స్‌ఈ ఫైళ్లను ఓపెన్ చేయొద్దని సీఎ్‌సబీ అధికారులు పేర్కొన్నారు. సాధారణ అనుమతి ప్రక్రియలకు భిన్నంగా వచ్చే వాటి విషయంలో తొలుత అనుమానదృష్టితో చూడాలని సీఎ్‌సబీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. బాధితులు వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని ఆమె పేర్కొన్నారు.
మోసపోయారిలా..
ముంబైలో ఒక కంపెనీ ఉద్యోగులుకు ఒక బాస్ నుంచి జిప్ ఫైల్ వచ్చింది. దాన్ని ఆ ఉద్యోగులు ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లు రూ.3.5కోట్లు కాజేశారు.
ముంబైకి చెందిన మరో సంస్ధ అకౌంట్స్ విభాగానికి చెందిన అధికారికి ఆ కంపెనీ సీనియర్ ఎక్జిక్యూటివ్ పేరిట వాట్సాప్ సందేశాలొచ్చాయి. ఆ సందేశాల ప్రకారం అకౌంట్స్ విభాగం వారు 12రోజుల్లో 63 లావాదేవీల ద్వారా రూ.10.4కోట్లు బదిలీ చేశారు. తర్వాత అసలు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుజరాత్‌లో ఒక ఫైనాన్షియల్ అడ్వయిజరీ సంస్ధ ఫైనాన్స్ అధికారికి బాస్ ఫొటోతో ఉన్న వాట్సాప్ ఖాతా నుంచి అత్యవసరంగా డబ్బు పంపాలని ఆదేశం వచ్చింది. దీంతో ఆ అధికారి అక్షరాల రూ.1.98కోట్లు బదిలీ చేశారు. తర్వాత డబ్బు పంపినట్లు బాస్‌కు ఫోన్ చేయడంతో అసలు కధ బయటపడింది.
హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ సంస్ధ ఎండీ పేరిట వాట్సాప్ సందేశాల ద్వారా ఇద్దరు ఉద్యోగుల నుంచి సైబర్ నేరగాళ్లు తాము సూచించిన ఖాతాలకు రూ.2.7కోట్లు మళ్లించుకున్నారు.