సరిహద్దు ఓటర్లే ‘కింగ్ మేకర్’!
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:57 AM
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల క్ల్లైమాక్స్ సీన్ ఇప్పుడు సరిహద్దుల వద్ద రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో నాలుగు దిక్కులా ఉన్న పొరుగు రాష్ర్టాల ఓటర్లే ఇప్పుడు అభ్యర్థుల గెలుపోటములను శాసించబోతున్నారు.
ముంబై, సూరత్ ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు.. వీడియో కాల్స్‌లో హమీల వర్షం
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల క్ల్లైమాక్స్ సీన్ ఇప్పుడు సరిహద్దుల వద్ద రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో నాలుగు దిక్కులా ఉన్న పొరుగు రాష్ర్టాల ఓటర్లే ఇప్పుడు అభ్యర్థుల గెలుపోటములను శాసించబోతున్నారు. సరిహద్దుల్లోని పురపాలక సంఘాల్లో ఒక్కో చోట 5-10వేల వరకు ఇతర రాష్ర్టాల ఓటర్లు ఉండటం ఇప్పుడు ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
మరాఠా మంత్రం.. కన్నడ తంత్రం!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 15 వేల మందికి పైగా మరాఠీ ఓటర్లు ఉన్నారు. 10కి పైగా వార్డుల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. అందుకే అభ్యర్థులు మరాఠీ భాషలో కరపత్రాలు ముద్రించి, సోషల్ మీడియాలోనూ అదే భాషలో ప్రచారం హోరెత్తించారు. అటు భైంసాలోనూ అదే పరిస్థితి. ఇక్కడ 7,500మందికి పైగా మరాఠీ, హిందీ ఓటర్లు ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. పొరుగున ఉన్న నాందేడ్, యావత్మాల్ నేతలను సైతం రంగంలోకి దించి అభ్యర్థులు బతిమిలాడుకుంటున్నారు. ఇక, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్, నారాయణపేట, మక్తల్ మునిసిపాలిటీల్లోకర్ణాటకకు చెందిన వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా అక్కడే స్థిరపడ్డాయి. వీరిని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కన్నడ నేతలతో తంత్రం నడుపుతున్నారు. వడ్డేపల్లి, ఐజ,అలంపూర్ మున్సిపాలిటీల్లో ఏపీ నుంచి వచ్చి ఇక్కడే ఓటర్లుగా ఉండి కింగ్‌మేకర్లుగా మారారు. నిజామాబాద్ జిల్లా భోదన్, బాన్సువాడలో మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన ఓటర్లు, బిచ్కుంద మునిసిపాలిటీలో కర్ణాటక మూలాలున్న ఓటర్లే గెలుపు మార్జిన్‌ను ప్రభావితం చేయనున్నారు.
కాగజ్‌నగర్ పేపర్ మిల్లే ‘గేమ్ ఛేంజర్’
ఇక కాగజ్‌నగర్ మునిసిపాలిటీ రాజకీయం అత్యంత విలక్షణంగా మారింది. ఇక్కడ పేపర్ మిల్లులో పనిచేసే సుమారు 20 వేల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు ఇప్పుడు అభ్యర్థుల జాతకాలను మార్చబోతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, ఒడిశా మూలాలున్న వీరు ఇక్కడే స్థిరపడి, తమ వార్డుల్లో అత్యంత శక్తిమంతమైన ఓటుబ్యాంకుగా ఎదిగారు. నిర్మల్‌లో ఉన్న మరాఠీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం సాగిస్తున్నారు. ఇక చెన్నూరు మునిసిపాలిటీ విషయానికి వస్తే.. ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర మూలాలున్న 5,500మంది ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా వీరు అవతరించారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు సరిహద్దులు దాటి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలను గల్లీల్లోకి రప్పించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొడ, ఖమ్మం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హుజూర్‌నగర్, కోదాడ, మిర్యాలగూడ మునిసిపాలిటీల్లోనూ సిమెంట్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఓట్లు అభ్యర్థుల గెలుపును డిసైడ్ చేయనున్నాయి. సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట వంటి చోట్ల ఏపీ నేతలతో అభ్యర్థులు ‘టచ్’లో ఉంటూ రహస్య ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
అభ్యర్థుల ‘హైటెక్’ రాయబారాలు
ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు క్షేత్రస్థాయిలో హైటెక్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముంబై, భీవండీ వంటి ప్రాంతాల్లో ఉన్న ఓటర్లతో అభ్యర్థులు స్వయంగా వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నారు. వారి సమస్యలు వింటూనే, ఓటు వేయడానికి రావాలని ప్రత్యేక ‘భరోసా’ ఇస్తున్నారు. 11 వ తేదీ ఉదయం కల్లా వీరంతా పోలింగ్ బూత్ వద్ద ఉండేలా.. ఓటర్లను తరలించేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సుల ఏర్పాటుకు అభ్యర్థులు చర్యలు చేపట్టారు. ఓటర్ల రానుపోను ప్రయాణ చార్జీలు, పోలింగ్ రోజున భోజనంతోపాటు ఒక్కో ఓటుకు ఇంత అని ముందుగానే ఖరారు చేసి, ఈ మొత్తాన్ని వారి బంధువుల ద్వారా అందజేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, సరిహద్దు రాష్ట్రాల ప్రభావం ఎవరిని గట్టెక్కిస్తుందో వేచిచూడాలి.