Share News

బోగస్‌ ఉద్యోగులతోబురిడీ

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:25 AM

రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో బోగస్‌ ఉద్యోగుల కుంభకోణం మరోసారి చర్చనీయాంశమైంది. రికార్డుల ప్రకారం తెలంగాణలో 1,75,000 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారని.....

బోగస్‌ ఉద్యోగులతోబురిడీ

  • ఉద్యోగులు లేకున్నా.. రికార్డుల్లో చూపి వేతనాలు పొందిన వైనం

  • సీఎం విచారణకు ఆదేశించడంతో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల్లో కలకలం

  • 25 వేల మంది బోగస్‌ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ

  • రంగంలోకి దిగిన కలెక్టర్లు.. ఖజానాకు నష్టంపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

  • ఏజెన్సీలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్న అధికారులు

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో బోగస్‌ ఉద్యోగుల కుంభకోణం మరోసారి చర్చనీయాంశమైంది. రికార్డుల ప్రకారం తెలంగాణలో 1,75,000 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారని, వీళ్లలో 25,000 మంది ఉద్యోగులు నిజంగా లేరని, కానీ వేతనాలు పొందుతున్నారని కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదేమీ గుర్తించకుండా కలెక్టర్లు వేతనాల ఫైళ్లపై ఎలా సంతకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేసి బోగస్‌ ఉద్యోగుల ద్వారా లబ్ధి పొందుతున్న ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, మాజీ సీఎస్‌ శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు 25 వేల మంది బోగస్‌ ఉద్యోగులను గుర్తించగా.. వారికి వేతనాలు ఆపేయాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. బోగస్‌ ఉద్యోగుల రూపంలో గతే పదేళ్లుగా లబ్ధిపొందిన ఏజెన్సీలు, వాటి నిర్వాహకులను గుర్తించి వారిపై క్రిమినల్‌ కేసలు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసరమైతే ఈ మొత్తం వ్యవహారంపై ఆర్థిక శాఖ నేతృత్వంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. అక్రమ చెల్లింపులు ఎలా జరిగాయి? ఇందులో భాగస్వాములు ఎవరు? ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం జరిగింది? అనే అంశాలపై లోతుగా విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ముసుగులో పేరోల్‌లో లేకుండానే వేతనాలు పొందుతున్న వారి లెక్కల తీయడంపై కలెక్టర్లు రంగంలోకి దిగారు. తమ పధిలో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. శాఖల వారీగా ఏజెన్సీల వారీ.. ఎంత మంది పని చేస్తున్నారు ? వేతనాలు ఎంత మందికి చెల్లిస్తున్నారు? అనే లెక్కలు పంపాలని సంబంధిత విభాగాధిపతులను కలెక్టర్లు ఆదేశించారు. దీంతో బోగస్‌ ఉద్యోగుల పేరుతో లబ్ధిపొందుతున్న ఏజెన్సీల్లో వణుకు మొదలైంది.

Updated Date - Mar 05 , 2026 | 02:25 AM