Share News

సర్‌.. బీఎల్‌వోలు ఎక్కడ?

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:17 AM

హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివాసం ఉండే ఓ చిరుద్యోగి ఆదివారం సెలవు రోజు కావడంతో ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తిచేసి...

సర్‌.. బీఎల్‌వోలు ఎక్కడ?

  • ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండా ఎక్కడో ఒకచోట కూర్చుని ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ

  • వారెక్కడ ఉంటారో తెలియక ఓటర్ల తికమక

  • పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా ఫారాల పంపిణీ

  • గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా... నల్గొండ ఫస్ట్‌!

  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో కేవలం 55 శాతం,హైదరాబాద్‌ జిల్లాలో 62 శాతమే ఫారాల పంపిణీ

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివాసం ఉండే ఓ చిరుద్యోగి ఆదివారం సెలవు రోజు కావడంతో ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తిచేసి ఇవ్వాలని అనుకున్నాడు. తమ ప్రాంతానికి చెందిన బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) ఎవరు, ఎక్కడ కలవాలంటూ బస్తీ అంతా అడగడం మొదలు పెట్టాడు. కానీ మధ్యాహ్నం వరకు జాడ కనిపెట్టలేకపోయాడు. చివరకు ఓ రాజకీయ పార్టీ నాయకుడిని కలిస్తే.. ఇంటి నంబర్‌ ఆధారంగా మీ ప్రాంత బీఎల్‌ఓ ఫలానా కమ్యూనిటీ హాల్లో ఉన్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లి ఫారం తీసుకోవాల్సి వచ్చింది. ఇది హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ మొదలై 10 రోజులైనా పట్టణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. పలువురు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లకుండా కమ్యూనిటీ, ఫంక్షన్‌ హాళ్లు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లనే అక్కడికి రావాలని సమాచారం ఇస్తున్నట్లు పలుచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటర్ల వివరాలను నేరుగా ఇంటి వద్దే ధ్రువీకరించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారం నమోదు చేయడం, అవసరమైతే పత్రాలపై అవగాహన కల్పించడం బీఎల్‌ఓల బాధ్యత. అయితే వారు కమ్యూనిటీ హాళ్లకు పరిమితం కావడంతో ఈ ప్రక్రియ లక్ష్యం దెబ్బతింటోందని ఆయా వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారం అందజేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా కారణాలు, ఒకేచోట ఎక్కువ మంది ఓటర్లకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కొందరు బీఎల్‌ఓలు ఈ పద్ధతి అనుసరిస్తున్నా ఇంటింటికీ వెళ్లే విధానానికి ఇది ప్రత్యామ్నాయం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బీఎల్‌ఓలు ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వకపోతే సంబంధిత ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ), అసిస్టెంట్‌ ఏఈఆర్‌ఓ, జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.


రాష్ట్రంలో 85.18శాతం పంపిణీ

సర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33,826,448 మంది ఓటర్లకు గాను 28,814,650 మందికి (85.18 శాతం) ఎన్యుమరేషన్‌ ఫారాలను ఆదివారం నాటికి పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ జిల్లాల్లో ఫారాల పంపిణీ చురుగ్గా జరుగుతుండగా పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లో మాత్రం నత్తనడకన సాగుతోంది. 99.09 శాతం ఫారాల పంపిణీతో నల్గొండ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో కూడా 98 శాతానికి పైగా ఫారాల పంపిణీ పూర్తయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్‌ జిల్లాలో మాత్రం నెమ్మదిగా సాగుతోంది. మొత్తం 47,36,669 మంది ఓటర్లలో 29,71,175 మందికే (62.73 శాతం) ఫారాలు పంపిణీ చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి (55.63 శాతం), రంగారెడ్డి (73.65 శాతం) జిల్లాల్లో కూడా పంపిణీ శాతం రాష్ట్ర సగటు కంటే తక్కువగా నమోదైంది.

Updated Date - Jul 06 , 2026 | 03:17 AM