బ్లాక్‌మెయిల్ భజంత్రీలు!
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:39 AM
చక్కని ఉద్యోగం ఉంది.. అమ్మాయికి కూడా నచ్చాడు అని వివాహ నిశ్చితార్థం చేసుకొని.. సగం పెళ్లి అయినట్టేనని గుండెలమీద చేయివేసుకున్న తల్లిదండ్రుల్లో కొందరికి ఆ ‘కాబోయే అల్లుళ్లు’ నరకం చూపిస్తున్నారు.
పెళ్లి చూపులకు బుద్ధిమంతుల గెట్‌పలో కంత్రీగాళ్లు.. నిశ్చితార్థం అయ్యాక అమ్మాయిలతో సాన్నిహిత్యం
ఫొటోలతో వధువు తరఫువారికి బెదిరింపులు
అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి: సజ్జనార్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): చక్కని ఉద్యోగం ఉంది.. అమ్మాయికి కూడా నచ్చాడు అని వివాహ నిశ్చితార్థం చేసుకొని.. సగం పెళ్లి అయినట్టేనని గుండెలమీద చేయివేసుకున్న తల్లిదండ్రుల్లో కొందరికి ఆ ‘కాబోయే అల్లుళ్లు’ నరకం చూపిస్తున్నారు. ఎంగేజ్‌మెంట్‌కు, వివాహానికి మధ్య వధువుతో సన్నిహితంగా గడిపి.. ఆ ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. బాధిత కుటుంబాలను బెదిరించి వారి నుంచి అందిన కాడికి నగదు, బంగారం దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల కొందరు యువకులు పనిగట్టుకొని మరీ చేస్తున్న నయా మోసమిది! కుటుంబసభ్యులు, బంధువులను వెంటేసుకొని పెళ్లిచూపులకు వెళ్లి బుద్ధిమంతులుగా బిల్డప్ ఇచ్చి.. డాబూ దర్పం, మాటకారితనంతో అమ్మాయి తరఫువారి నుంచి ఇట్టే మార్కులు కొట్టేసి నిశ్చితార్థం చేసుకుంటున్నారు.
ఆ తర్వాత కలిసి సరదాగా బయటకు వెళ్తాం మామగారూ అనంటే కాబోయే అల్లుడే కదా అనే భరోసాతో అమ్మాయిని వారి వెంట పంపించడమే తప్పవుతోంది. అమ్మాయితో కలిసి తిరిగి.. ఏకాంతంగా గడిపి ఆ ఫొటోలు, వీడియోలను అమ్మాయిల తల్లిదండ్రులకు చూపి బెదిరింపులకు దిగుతున్నారు. పెళ్లి, పీటలదాకా చేరాలంటే తమకు అదనపు కట్నం కింద భారీగా డబ్బివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా వధువు తల్లిదండ్రుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారుతోంది. అడిగినంత డబ్బిచ్చి పెళ్లి జరిపిద్దామనంటే.. ఆ తర్వాత అమ్మాయికి వాడు ఇంకెంత నరకం చూపుతాడేమోననే ఆందోళన! ఒకవేళ పెళ్లి రద్దు చేసుకుంటే, ఆ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తాడేమోనన్న భయం! ఇలా ఏటూ తేల్చుకోలేక బాధితులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బాధితుల్లో చాలా వరకు పరువుపోతుందనే భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. అయితే ఇలాంటి ఘటనలపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో ప్రధానంగా అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు.

పెద్దలు కుదిర్చిన పెళ్లేనని గుడ్డిగా నమ్మొద్దు
పెళ్లి పేరుతో మోసాలకు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే క్రిమినల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి మోసాలను భరించి జీవితాంతం నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. నిశ్చితార్థమైనా సరే, పెళ్లి పీటలెక్కేవరకు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, అలవాట్లు, అతడి స్నేహితుల గురించి ఆరా తీయండి. పెళ్లికి ముం దే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా వెంటనే ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి సమస్యలుంటే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555, డయల్100కు కాల్ చేయండి.
-వీ.సీ. సజ్జనార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్