‘నల్ల’టి నీళ్లు..
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:50 PM
మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ పరి ధిలోని నల్లాల ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు జలమా... గరళ మా ....అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మున్సిపాలిటీ కుళాయిల ద్వారా వస్తున్న బురద నీరు
-వినియోగించేందుకు ప్రజల విముఖత
-మినరల్ వాటర్ వైపు పరుగులు
-శుద్ది చేయకుండానే నేరుగా సరఫరా..?
-అధికారుల వైఖరిపట్ల ప్రజల ఆగ్రహం
మంచిర్యాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ పరి ధిలోని నల్లాల ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు జలమా... గరళ మా ....అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా నల్లాల నుంచి వస్తున్న నీరు బురదమయంగా ఉండటంతో ప్రజలు వినియోగించేందుకు జంకుతున్నారు. నల్లాల నుంచి వస్తున్న నీరు మురికిగా ఉండటంతోపాటు దుర్వాసన వస్తుండటంతో ప్రజలు మంచి నీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఇటీ వల కురిసిన వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరింది. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల బెడద పొంచి ఉండగా, మునిసిపల్ కార్పొరేషన్ మురికితో కూడిన తాగునీరు సరఫరా చేస్తుండటంతో వ్యాధులు ప్రభలే ప్రమాధం ఉందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నీటి శుద్ధికి మంగళం...?
మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఇంటెక్ వెల్ నుంచి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ఇంటెక్ వెల్ నుంచి నీటిని శుద్ధి చేసేందుకు అత్యంత అధునాత వ్యవస్థను ఏర్పాటు చేయగా, నగర ప్ర జలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాల్సి ఉంది. కానీ తొలకరి వర్షాలకే నీరు మొ త్తం కలిషితం కాగా, నేరుగా అదే నీరు కుళాయిల నుంచి సరఫరా అవుతుం డటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాకాలం కావడం, అంటు వ్యాధులు ప్ర బలే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. అత్యంత అ ధునాతన వ్యవస్థ ఉండి కూడా, మురికి నీరు కుళాయిల గుండా ప్రవహించ డం ప ట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని శుద్ది చేయకుండా నే నేరుగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మురికి నీరు దుర్వాసన రాకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ వేస్తున్న దా ఖలాలు కూడా కానరావడం లేదు. మున్సిపాలిటీ నీరు తాగేందుకు సరికదా కనీసం వంట చేసేందుకు కూడా పనికి రాకుండా పోతుందని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. బిందెల్లో పట్టిన నీరు మురికిగా వస్తుండటంతో వృధాగా పారబోస్తున్నట్లు వాపోతున్నారు. అరకొరగా సరఫరా అయ్యే మంచినీరు ఇలా మురికి ఉండటం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే తంతు నెలకొంటుండగా, అవసరమైన చర్యలు చేపట్టడంలో యాంత్రాంగం పూర్తిగా విఫల మవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మినరల్ వాటర్ వైపు పరుగులు....
నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని వినియోగించేందుకు ఇష్టపడని ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. రూ. 20 వెచ్చించి ప్రతీ రోజూ ఒక మినరల్ వాటర్ క్యాన్ కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా నల్లాల నుంచి మురికి నీరు వస్తున్నా పాలకవర్గంగానీ, మున్సిపాలిటీ అధికారులుగానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మురికి నీరు సరఫరా కారణంగా మంచిర్యాల నగరంలోని వాటర్ ప్లాంటులన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.
వారం రోజులుగా నీటి సరఫరా బంద్...
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లలో వారం రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముల్కల్ల వంతెన సమీపం నుంచి పాత మంచి ర్యాల బస్టాప్ వరకు గతంలో వేసిన జీఆర్పీ పైప్ లైన్ మార్చే పనులు కొనసాగు తున్నాయి. జీఆర్పీ పైప్‌లైన్ తరుచుగా పగులుతుండటంతో దాని స్థానంలో డీఐ పైప్‌లైన్ వేస్తున్నారు. దీంతో రెండు రోజులపాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ సిబ్బంది వారం రోజుల క్రితం ప్రకటించారు. అయితే వారం రోజులు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడం గమనార్హం. తాగునీటి సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా సిబ్బంది ఫోన్లు ఆఫ్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి సరఫరాలో నెలకొన్న అంతరాయంపై మునిసిపల్ పాలకవర్గం, అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.