బ్లాక్‌లో వాణిజ్య గ్యాస్!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:55 AM
పశ్చిమాసియాలో యుద్ధం దెబ్బకు ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు రంగాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి! ముఖ్యంగా..
రూ.3500 నుంచి రూ.4 వేలకు చేరిన సిలిండర్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం దెబ్బకు ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు రంగాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి! ముఖ్యంగా.. నిత్యం పదుల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు అవసరమయ్యే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, ఆలయాలపై ఈ ప్రభావం బాగా పడుతోంది. ప్రభుత్వం గృహవినియోగ సిలిండర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో.. వాణిజ్య సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. కమర్షియల్ గ్యాస్ బండ మార్కెట్లో దొరకట్లేదు. గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించినప్పుడు లేవని చెబుతున్నా.. ఎక్కువ ధర చెల్లించే వారికి మాత్రం విక్రయిస్తున్నట్టు, సిలిండర్ల సరఫరా ఉన్నాకూడా ఏజెన్సీ నిర్వాహకులు కావాలనే వాటిని నిలిపివేసి, బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో శక్తి, చార్మినార్, సూపర్ గ్యాస్ ఏజెన్సీల ద్వారా కమర్షియల్ గ్యాస్ రూ.3వేలకు దొరుకుతుండగా.. మరికొన్ని చోట్ల రూ.3500 నుంచి రూ.4 వేల దాకా పలుకుతోంది. బుక్ చేసుకున్న వాణిజ్య సిలిండర్‌కు సైతం డెలివరీ సమయంలో.. ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి.. రాజధాని హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్ ఎక్కువ ఉండడంతో పలు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతం నుంచి సైతం వచ్చి మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. కొందరు అధికమొత్తాలు చెల్లించి కొంటుండగా.. చిన్నచిన్న హోటళ్లవాళ్లు అంత భారం భరించలేక మూసేస్తున్నారు. మరికొందరు కట్టెల పొయ్యిల్ని ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో బిర్యానీ కి ప్రఖ్యాతిగాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రముఖ హోటల్ బావర్చిని బుధవారం మూసేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఐటీసీ హోటల్స్ తాత్కాలికంగా తమ లంచ్, డిన్నర్ సేవలలో అంతరాయా లు ఉండొచ్చని ప్రకటించగా, పేరొందిన పలు హోట ల్స్ గ్రూప్‌లు కూడా తమ అతిథులకు ఇవే తరహా సందేశాలను పంపుతున్నట్టుగా వార్తలువస్తున్నాయి.
ఆలయాల్లో ఇబ్బందులు..
తెలుగు రాష్ట్రాల్లో నిత్యాన్నదానంతో భక్తుల కడుపు నింపే పలు ప్రముఖ ఆలయాల్లో.. గ్యాస్ కొరత ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్టలో నాలుగు రోజులకు సరిపడ గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నా యి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డూ, పులిహోర, వడ దద్ద్యోజనంతోపాటు స్వామివారికి నివేదన జరిపే రామానుజకూటమి (స్వామివారి ప్రసాదాల వంటశాల), నిత్యాన్నదానం కోసం భోజన తయారీకి రోజుకు దాదాపు 5వేల కిలోల ఎల్‌పీజీ గ్యాస్ కావాలి. కొండ దిగువన ఏర్పాటుచేసిన ఎల్‌పీజీ గ్యాస్ స్టేషన్ నుంచి పైపుల ద్వారా ఆ గ్యాస్‌ను ఆయా వంటశాలలకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. యాదగిరిగుట్టకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్ చమురు సంస్థలకు, జిల్లా అధికార యంత్రాంగానికి లేఖలు రాశారు. దీనికి చమురు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు ఆల య అధికారులు తెలిపారు. అలాగే.. భద్రాచలం, కొండగట్టు, వేములవాడ, కొమరవెల్లి, ఐదో శక్తిపీఠం జోగులాంబ ఆలయం, సికింద్రాబాద్ గణేశ్ ఆలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో భక్తులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. కొన్ని పెద్ద ఆలయాల్లో పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నప్పటికీ చాలా ఆలయాల్లో ప్రతి 2-3 రోజులకొకసారి సిలిండర్లను కొనుగోలు చేస్తుంటారు. ఉదాహరణకు.. సికింద్రాబాద్‌లోని ప్రముఖ దేవాలయాలైన గణేష్ టెంపుల్ (స్టేషన్ రోడ్డు), శ్రీఉజ్జయినీ మహాకాళీ దేవస్థానాలలో నైవేద్యాలు, ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు నెల నెలా సరాసరి 60 సిలిండర్లు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆయా దేవాలయాల్లో ఉన్న సిలిండర్లతో రెండు మూడు రోజులు గడపవచ్చు కానీ తర్వాత పరిస్థితి ఏమిటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. గ్యాస్ సమస్య, ఎదురయ్యే పరిణామాలు, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో వైపు ఆలయా అధికారులు ఎక్కడికక్కడ తమకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు లేఖలు రాశారు. గ్యాస్ సరఫరా నిలిపివేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, నిరంతరాయంగా సరఫరా కొనసాగించాలని లేఖలు రాశారు. కాగా.. ఏపీలోని తిరుమలలో 33 టన్నుల గ్యాస్ నిల్వలున్నాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో అక్కడ ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని చెబుతున్నారు.
కట్టెలు కొనేస్తున్నారు!
గ్యాస్‌కొరత కారణంగా చిన్నసైజు సిలిండర్ల రీఫిల్ ధర అమాంతం పెరగడంతో వాటి ధరలు భరించలేక రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. గ్రూప్ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకునేవారు కూడా.. సొంతంగా వంట చేసుకునేందుకు ఈ చిన్న సిలిండర్లనే వాడుతుంటారు. వారంతా ఇప్పుడు కట్టెల పొయ్యిల వైపు దృష్టి సారించి.. కట్టెల అడితీలకు వెళ్తున్నారు. డిమాండ్ పెరగడంతో కట్టెల వ్యాపారులు రేట్లను 50 నుంచి 100ు మేర పెంచేశారు. నిన్నమొన్నటిదాకా కిలో రూ.10కి అమ్మిన కట్టెలను రూ.15-20కి విక్రయిస్తున్నారు. మరోవైపు.. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా పొందుతున్న హైరైజ్ అపార్ట్‌మెంట్లలో నివసించేవారు తమ పరిస్థితి ఏమిటా అని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇలా పైప్‌లైన్ గ్యాస్ సరఫరా అయ్యే 20 అంతస్తులకు పైబడిన హైరైజ్ అపార్టుమెంట్లు 50కి పైనే ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్లలో ప్రస్తుతానికి గ్యాస్ కొరత ప్రభావం లేదు. కానీ, మున్ముందు ఎదురైతే.. తమకు సిలిండర్లు అందక, గ్యాస్ రాక ఇబ్బంది వివిధ ప్రాంతాల్లో ఉన్న హైరైజ్ అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న వారి వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ ప్రధానంగా అంశంగా మారిందని లాన్సమ్ హైరైజ్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ఎ.రాజశేఖర్ రెడ్డి తెలిపారు.