బ్లాక్ కాఫీ ముసుగులో డ్రగ్స్ దందా
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:54 AM
భాగ్యనగరంలో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది, కొండాపూర్ పరిధిలోని క్వాక్ ఎరీనా పబ్‌లో గురువారం అర్ధరాత్రి ‘బ్లాక్ కాఫీ’ పేరుతో సాగుతున్న మాదకద్రవ్యాల దందాను పోలీసులు రట్టు చేశారు.
క్వాక్ ఎరీనా పబ్‌లో ‘ఈగల్’ మెరుపు దాడులు
64మందికి డ్రగ్స్ పరీక్షలు
ఏపీ ఐఏఎస్ అధికారిణికుమారుడు సహా 7గురికి పాజిటివ్
హైదరాబాద్/రాయదుర్గం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది, కొండాపూర్ పరిధిలోని క్వాక్ ఎరీనా పబ్‌లో గురువారం అర్ధరాత్రి ‘బ్లాక్ కాఫీ’ పేరుతో సాగుతున్న మాదకద్రవ్యాల దందాను పోలీసులు రట్టు చేశారు. ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ నార్కొటిక్స్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏపీకి చెందిన మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు సహా ఎనిమిది మంది పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ డీజే నిర్వాహకుడు ‘న్కోసినాతి’ ఈ పార్టీకి ప్రధాన ఆకర్షణ కావడం.. బ్లాక్ కాఫీ డీజే పార్టీ అంటూ పబ్ నిర్వాహకులు కూడా పెద్దఎత్తున ప్రచారం చేయడంతో సెలబ్రిటీలతో పాటు పలువురు ఈ పబ్‌కు వచ్చారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి పబ్‌పై మెరుపు దాడులు చేశారు. పార్టీలో అనుమానాస్పద ప్రవర్తనతో ఉన్న 64మందికి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి ప్రాథమికంగా పాజిటివ్ అని తేలింది. వీరిని గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌కు తరలించి శుక్రవారం ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. తొలుత జరిపిన పరీక్షల్లో ఐదుగురు గంజాయి, ముగ్గురు ఎండీఎంఏ వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాస్తవానికి వీరంతా బయట గంజాయి, ఇతర మత్తుమందులు తీసుకుని పబ్‌కు వచ్చారని భావిస్తున్నారు. గురువారం ‘డ్రై డే’ (మద్యం అమ్మకాలు లేనిరోజు) కావడంతో, రాత్రి పది గంటల తర్వాత మద్యం అనుమతించారని, దీంతో చాలా మంది ఇటు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా బయట డ్రగ్స్ తీసుకుని పబ్‌కు వచ్చారా..?, లేక పబ్‌లోనే సరఫరా జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పార్టీలో పాల్గొన్న సినీనటి హేమ, స్పెయిన్‌కు చెందిన ఆర్టిస్ట్ అలెగ్జాండర్, క్విక్ ఎరీనా డీజే కేవీ తదితరులకు నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.
పాజిటివ్‌గా తేలింది వీరే..
డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిలో మోనిష్ ఉమేశ్(వ్యాపారం), పృథ్వీరాజ్(కాంట్రాక్టర్), అభిషేక్ శర్మ(సా్‌ఫ్టవేర్ ఇంజనీర్), రిషబ్ శ్రీవాస్తవ(వ్యాపారం), హరిత్(సా్‌ఫ్టవేర్ ఇంజనీర్), రిత్విక్(ఉబెర్ అనలిస్ట్), రితేశ్(మొబైల్‌షాప్), జ్యోతిరాదిత్య ఉన్నారు. రిత్విక్ అనే యువకుడికి తొలుత పాజిటివ్ వచ్చినా తదుపరి పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అతడు డిప్రెషన్ కోసం వాడుతున్న మందుల వల్లనే అలా వచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల తల్లిదండ్రులను పిలిపించి, వారిముందే కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిపై కేసు నమోదు చేసి, గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.