అనైతిక పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సీరియస్
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ప్రత్యర్థులతో సొంత పార్టీ ముఖ్య నేతలు చేతులు కలపడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకున్నది.
ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలపై ఆగ్రహం
ధిక్కారానికి పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు?
గురువారం నివేదిక పంపనున్న రాష్ట్ర బీజేపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ప్రత్యర్థులతో సొంత పార్టీ ముఖ్య నేతలు చేతులు కలపడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకున్నది. అనైతిక పొత్తులు కుదుర్చుకున్న సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చేశారని అందిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్న బీజేపీ అధిష్టానం.. ధిక్కారానికి పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న తమ సూచనకు అనుగుణంగా వ్యవహరించాలన్న రాష్ట్ర నాయకత్వం నిర్ణయాన్ని సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ధిక్కరించడాన్ని అధిష్టానం సీరియ్‌సగా తీసుకున్నది. అనైతిక పొత్తులపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. మునిసిపాలిటీలను బట్టి వేర్వేరుగా వ్యవహరించడం, హంగ్ మునిసిపాలిటీలలో అవకాశాలు వదులుకోవడం, అధిక స్థానాలు గెలుచుకున్న చోట్ల చైర్మన్ పదవిని ఎందుకు వదులుకున్నారన్న అంశాలపై బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. ‘మునిసిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు మద్ధతు ఇవ్వడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. రాష్ట్ర పార్టీకి కనీస సమాచారం ఇవ్వకుండానే రాష్ట్రపార్టీ అధ్యక్షుడి అనుమతి తీసుకున్నాకే బీఆర్‌ఎ్‌సకు ఓటు వేశామని కొంతమంది ముఖ్యనేతలు మీడియాకు వెల్లడించడం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్రలో భాగమే. నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఘటనలతో పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు’ అని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు జాతీయ కీలక నేత స్పష్టం చేశారని సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం గురువారం ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపనున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.