అన్యమత ధర్మాలకు సీఎం పెద్దపీట
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:03 AM
సీఎం రేవంత్‌రెడ్డి అన్యమతాలకు పెద్దపీట వేస్తూ, హిందూ దేవాలయాలను విస్మరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు.
దేవాలయాలను గాలికొదిలేసిన రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ వైఫల్యం వల్లే కుమ్మెర ఘటన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి అన్యమతాలకు పెద్దపీట వేస్తూ, హిందూ దేవాలయాలను విస్మరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన, కుమ్మెర బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే కుమ్మెర మల్లన జాతరలో పసిపాప ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఘటన జరిగి మూడు రోజులవుతున్నా బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు, అధికారులు జాప్యం చేయడంపై రాంచందర్‌రావు మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్ర పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దేవాలయాల్లో కుల వివక్ష కొనసాగడం దురదృష్టకరమని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి అన్యమతాలకు చెందిన పార్టీలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాచీన దేవాలయాలన్నింటినీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని, సామాన్యుడు సైతం దేవుణ్ని దర్శించుకునే అవకాశం కల్పించాలని రాంచందర్‌రావు సూచించారు.