పునర్విభజనపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:36 AM
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు మండిపడ్డారు.
జనాభా, ప్రాంతం ప్రాతిపదికన పునర్విభజన జరగదు: రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు మండిపడ్డారు. జనాభా, ప్రాంతం ప్రాతిపదికన పునర్విభజన జరగదని, ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. ‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది ప్రతీసారి జనగణన తర్వాత జరిగే రాజ్యాంగబద్ధ ప్రక్రియ... జనగణన పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. అయితే డీలిమిటేషన్ జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది... దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం... డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాల సీట్లు తగ్గే పరిస్థితి లేదు... న్యాయంగా, సమానంగా అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది...’‘ అని ఆయన వివరించారు.