నారాయణపేటలోనూ విరిసిన కమలం
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:20 AM
మునిసిపల్ పోరులో కమలం పార్టీ సొంతంగా, తొలిసారిగా ఒక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
మెట్‌పల్లిలో ఆధిక్యం.. త్రుటిలో చేజారిన పీఠం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ పోరులో కమలం పార్టీ సొంతంగా, తొలిసారిగా ఒక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ కరీంనగర్ గడ్డపై కాషాయజెండా ఎగురవేశారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక నాయకులను ప్రశంసించారు. మునిసిపాలిటీలకు సంబంధించి నారాయణపేటను బీజేపీ ఖాతాలో వేసుకుంది. ఆదిలాబాద్, మెట్‌పల్లి, రాయికల్‌లో మెజారిటీ స్థానాలు సాధించినా చైర్మన్ పదవిని దక్కించుకోలేకపోయింది. మొత్తం 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో 260 వార్డులు, 76 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు నారాయణపేట, ఆదిలాబాద్, మెట్‌పల్లి, రాయికల్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మెట్‌పల్లి మునిసిపాలిటీలో ఆధిక్యం సాధించినా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. అక్కడి జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ కౌన్సిలర్లకు కావాలనే సకాలంలో విప్ జారీచేయకపోవడమే ఈ పరిణామానికి దారితీసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆదిలాబాద్‌లో కూడా కమలం మెజారిటీ సీట్లు సాధించినా చైర్మన్ పదవి దక్కలేదు.
కరీంనగర్‌ది ప్రజాస్వామ్య స్ఫూర్తి: కిషన్‌రెడ్డి
కరీంనగర్ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్నారు. ‘అధికార గర్వంతో కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమాలకు పాల్పడినా ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేరని కరీంనగర్ ప్రజలు చాటి చెప్పారు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.