BJP Telangana chief Ramchander Rao: మజ్లిస్‌తో దేశానికి ప్రమాదం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:59 AM
మజ్లిస్ పార్టీ నుంచి మన దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు...
రాజకీయాల్లో మార్పు రావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్ పార్టీ నుంచి మన దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఈ పరిణామం ఒక్క హైదరాబాద్‌కో, తెలంగాణకో మాత్రమే పరిమితం కాలేదని, కాంగ్రెస్ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు వైద్యులు, పారామెడికల్ నిపుణులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మేధావులపై ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు తమ విధానాలను ప్రజలకు వివరించలేక, బూతుల రాజకీయాలతో కాలం గడుపుతున్నాయని మండిపడ్డారు. జాతీయ అంశాలపై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ‘సర్’ వంటి జాతీయ అంశాలపై రేవంత్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు.
పన్నులు కట్టని వారితో కలపొద్దు: విశ్వేశ్వర్ రెడ్డి
ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జీహెచ్‌ఎంసీలో డివిజన్లను విభజించడం సరికాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పన్నులు కట్టేవారిని.. కట్టనివారితో కలపొద్దని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆదిభట్ల, తుక్కుగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్, బండ్లగూడ మునిసిపాలిటీలను చార్మినార్ జోన్‌లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము పన్నులు కడుతుంటే, పాతబస్తీలో ఖర్చు ఎలా చేస్తారని ప్రశ్నించారు.