Share News

రాహుల్‌ విదేశీ ఏజెంట్‌: రాంచందర్‌రావు

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:53 AM

రాహుల్‌ గాంధీ ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల కోసం విదేశీ ఏజెంట్‌లా మారి బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని..

రాహుల్‌ విదేశీ ఏజెంట్‌: రాంచందర్‌రావు

  • దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌-బీజేపీ పోటాపోటీ నిరసనలు

  • రాహుల్‌ తీరును దుయ్యబట్టిన బీజేపీ అధ్యక్షుడు నబీన్‌

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, హనుమకొండ సిటీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల కోసం విదేశీ ఏజెంట్‌లా మారి బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు ఆరోపించారు. నీట్‌ అంశంపై ఢిల్లీలో నిరసనకు దిగిన వారిలో నీట్‌ విద్యార్థులే లేరని, అసాంఘీక, అలా్ట్ర లెఫ్ట్‌ మూకలతో ఆందోళనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ బుధవారం చేపట్టిన ‘గాంఽధీ భవన్‌ ముట్టడి’ కార్యక్రమంలో భాగంగా రాంచందర్‌రావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు గాంధీభవన్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. రాంచందర్‌రావు సహా పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌ రావు మాట్లాడుతూ.. గతంలో రైతు ఉద్యమం ముసుగులో, షాహిన్‌ బాగ్‌ ఆందోళనలో ఏవిధంగా దేశవ్యతిరేక శక్తులు హైజాక్‌ చేశాయో, నేడు ‘సీజేపీ’ పేరుతో జరుగుతున్న ధర్నా కూడా అదే తరహాలో సాగుతోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై సభలో చర్చకు సిద్ధమని కేంద్రం చెప్పినప్పటికీ రాహుల్‌ గాంధీ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం చట్టసభల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంటే రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ ప్రేరణతో విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.


నీట్‌ అంశంపై ఢిల్లీలో జరిగిన నిరసనల్లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ, చైనా, పాకిస్థాన్‌కు మద్దతుగా కొందరు దేశవ్యతిరేక నినాదాలు చేయడం దిగ్ర్భాంతికరమన్నారు. కాంగ్రెస్‌ ‘తుక్డే తుక్డే’ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని, పోలీసుల అరెస్టులకు భయపడేది లేదని రాంచందర్‌ రావు స్పష్టం చేశారు. కాగా, నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కాక్రోచ్‌ పార్టీతో పోటీ పడేందుకే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా పేరుతో కాంగ్రెస్‌ రాజకీయ డ్రామా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీని ప్రతిపక్ష నేతగా కూడా జనం అంగీకరించడం లేదని, ఆయన ప్రధాని కావడం జరగని పనని సంజయ్‌ స్పష్టం చేశారు. కాగా, దేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్న దేశ వ్యతిరేక, విదేశీ శక్తులకు అల్లా ఆశీస్సులతో వారి భాషలోనే సమాధానం చెబుతామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయం వద్ద దాడులకు దిగిన కాంగ్రెస్‌ నేతలకు సహకరించిన పోలీసులు.. కాంగ్రెస్‌ తీరుకు నిరసనగా ధర్నాకు దిగిన బీజేపీ శ్రేణులను మాత్రం అరెస్టు చేశారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు దుయ్యబట్టారు.


హనుమకొండలో బీజేపీ నిరసన ఉద్రిక్తం

హనుమకొండ, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌ల్లో బీజేపీ శ్రేణులు రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేసి నిరసన తెలిపాయి. అయితే, హనుమకొండలో బీజేపీ శ్రేణులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయమని పోలీసులకు హామీ ఇచ్చి నిరసన చేపట్టిన బీజేపీ శ్రేణులు.. హనుమకొండ డీసీసీ భవన్‌ ఎదుట దిష్టిబొమ్మ దహనానికి యత్నించాయి. పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. కానీ, రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, యూత్‌ కాంగ్రెస్‌ నేత తోట పవన్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుటకు వచ్చి బీజేపీ నేతలకు చెప్పులు చూపించి రెచ్చగొట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారగా పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు.

Updated Date - Jul 23 , 2026 | 05:58 AM