మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:46 AM
మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ దాని పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే మాత్రం ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు.
కానీ.. పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. బఫర్ జోన్ పేరుతో ప్రజలను బహిష్కరించొద్దు
మూసీని వికారాబాద్ నుంచి చివరిదాకా ప్రక్షాళన చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
పునరుజ్జీవ ప్రణాళికలో శాస్త్రీయత లేదు
తప్పులతడకగా డీపీఆర్
కేంద్ర జల వనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్
హైదరాబాద్ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ దాని పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే మాత్రం ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల ఇళ్లు కూల్చుతామంటే, మరోవైపు ఓ మంత్రి 1,400 ఇళ్లు మాత్రమేనని అసెంబ్లీలో అంటున్నారని, అసలు నిజం ఏదీ? ప్రజలు ఎవర్ని నమ్మాలని ప్రశ్నించారు. నార్సింగి ప్రాంతంలో పెద్ద నిర్మాణాలకు బఫర్ జోన్ వర్తించకపోతే, మధు పార్కు రిడ్జ్ వంటి భవనాలకు ఎలా వర్తిస్తోందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ‘మూసీ నది పునరుజ్జీవం-వాస్తవాలు’ అనే అంశంపై ఆదివారం బేగంపేటలోని ఓ హోటల్‌లో మహారాష్ట్ర సీఎం సలహాదారు, కేంద్ర జల వనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ ఎక్కడైనా ప్రాజెక్టులు చేపడితే ముందుగా నష్టపోయేవారికి పరిహారం అందిస్తారని, కానీ ఇక్కడ ‘ముందు కూల్చి, తర్వాత ఇస్తా’మనే అన్యాయమైన విధానం కనిపిస్తోందన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మొదట రూ.5 వేల కోట్లు అవుతుందని చెప్పి, కొన్ని రోజుల్లోనే రూ.7 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదన్నారు. మూసీ వికారాబాద్ జిల్లాలో ప్రారంభమై నల్గొండ, సూర్యాపేట జిల్లాల గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుందని, నది పుట్టుక నుంచి చివరి వరకు ప్రక్షాళన చేయాలని సూచించారు.
ఇది ఒక ప్రాజెక్ట్ మాత్ర మే కాదని, మన భవిష్యత్తుకు పెట్టుబడి అన్నారు. మన ఆరోగ్యానికి, రైతుల జీవనానికి, తెలంగాణ అభివృద్ధికి అత్యవసరమని చెప్పారు. అమెరికాలోని షికాగో నగరంలో సరస్సులు, న్యూయార్క్-న్యూజెర్సీ మధ్య ప్రవహించే నదులు, ఇంగ్లండ్‌లో మాంచెస్టర్ ప్రాంతంలోని నదులు, లండన్‌లోని థేమ్స్, పారి్‌సలోని సీన్ వంటి నదుల పక్కనే అభివృద్ధి జరిగిందని, వాటి పక్క నే భవనాలు ఉన్నాయని, పర్యాటక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. అక్కడ బఫర్ జోన్ పేరుతో ప్రజలను బహిష్కరించలేదని చెప్పారు. రాష్ట్రంలో పెన్షన్లు, రైతు భరోసాకు డబ్బులు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతోందని, అంత భారీ మొత్తాన్ని ఎక్కడ్నుంచి తెస్తుందని ప్రశ్నించారు. వెదిరె శ్రీరామ్ మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల్లో శాస్త్రీయ దృష్టికోణం లేదని విమర్శించారు. జీవం లేని నదిపై అలంకరణ చేయడంతో ప్రయోజనం ఉండదని, ముందుగా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించాలని సూచించారు. నదిలో చేపలు జీవించి, నీటి నాణ్యత మెరుగుపడినప్పుడే మూసీ పునరుజ్జీవం సాధ్యమవుతుందన్నారు. ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ కాదని, ఒక సమగ్ర పర్యావరణ, సామాజిక, శాస్త్రీయ ప్రక్రియ అన్నారు. అది విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, నమామి గంగే, సబర్మతి వంటి ప్రాజెక్టుల్లో మాదిరిగా కాలనీ, వార్డు స్థాయిలో ప్రజలు, నిపుణులు, సంస్థలతో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ తప్పులతడకగా ఉందని, పలు అంశాలపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించలేదని చెప్పారు.
తక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవానికి డీపీఆర్‌ను ప్రభుత్వానికి ఉచితంగా అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టు ఆగకుండా ముందుకెళ్లేలా 3 దశల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 10-15 శాతం ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తే ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా ప్రాజెక్టు పూర్తిచేయవచ్చని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇదేవిధానం అవలంబిస్తున్నాయన్నారు. మూసీ చుట్టూ గోడలు కడితే భారీ వర్షాలు పడినప్పుడు నీరు ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. చిన్నవాగులను పునరుద్ధరించకుండా ప్రధాననది పునరుజ్జీవం అసాధ్యమన్నారు. మూసీ మొత్తం పరివాహక ప్రాంతాన్ని ఒకే వ్యవస్థ కింద నిర్వహించడానికి ‘మూసీ రివర్ బేసిన్ అథారిటీ’ ఏర్పాటు చేయాలని, సమగ్ర బేసిన్ ప్లాన్ ఉండాలన్నారు. నీటి నాణ్యతపై బీఏడీ, డీఓ వంటి పరామితులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.