TG BJP President N Ramchander Rao: మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరే
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:42 AM
మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు.
జనసేనతో పొత్తు ఊహాజనితం: రాంచందర్ రావు
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్న నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేయాలన్నది తమ పార్టీ స్థానిక నాయకుల మనోగతం అని అన్నారు. ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాజకీయ పరిస్థితులకు సంబంధం లేదన్నారు. ఏపీలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కూటమి కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఊహాజనితమైందని, అలాంటి వాటిపై స్పందించబోమన్నారు. మహాత్మాగాంధీపై అంత గౌరవం ఉంటే శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన పేరు ఎందుకు పెట్టలేదని రాంచందర్‌రావు.. కాంగ్రెస్‌ను నిలదీశారు. గాంధీ పేరు చెప్పుకొని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని మండిపడ్డారు. వీబీ జీరాం చట్టంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో రాంచందర్ రావు మాట్లాడారు. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ కు గాంధీ పేరు గుర్తుకురాలేదని విమర్శించారు.