Share News

ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:28 AM

రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు.

ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్‌ స్థానాలను గెలుస్తాం

  • సీఎం.. పాలనపై దృష్టి పెట్టాలి: రాంచందర్‌రావు

జనగామ రూరల్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఆదివారం జనగామ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. రాబోయే జీహెంఎంసీ ఎన్నికల్లో 3 మేయర్‌ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ఆ వైఫల్యాలను సమీక్షించుకుని లోపాలను సవరించుకున్నామని వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధభయంతో భయపడుతుంటే..దేశ ప్రజలు మాత్రం మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారని రాంచందర్‌ రావు అన్నారు. లాక్‌డౌన్‌ విధించే అవకాశమే లేదని తెలిపారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాహుల్‌ గాంధీకి రూ.1000 కోట్లు ఇస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. సీఎం మొదటగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి, పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని, అధికారంలోకి వచ్చాక కూల్చివేతలే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి, డొక్కు బస్సులను నడపడం వల్ల ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో గ్యాస్‌ కొరత సృష్టించడం వెనక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని రాంచందర్‌రావు ఆరోపించారు.

ఖానాపూర్‌ విజయం ప్రత్యేకం

ఖానాపూర్‌ మున్సిపాలిటీలో బీజేపీ సాధించిన విజయం ప్రత్యేకమైనదని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కమలం వికసించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎత్తుగడలను చిత్తుచేస్తూ ఖానాపూర్‌ మున్సిపాలిటీపై కాషాయజెండా ఎగురవేయడం చరిత్రాత్మక విజయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 05:28 AM