Share News

25 నుంచి బీజేపీ రైతు భరోసా యాత్ర

ABN , Publish Date - May 23 , 2026 | 05:22 AM

కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ (సోమవారం) నుంచి బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహించనుందని ఆ పార్టీ శాసనసభాపక్ష...

25 నుంచి బీజేపీ రైతు భరోసా యాత్ర

  • నిర్మల్‌లో రాంచందర్‌రావు ప్రారంభిస్తారు: ఏలేటి

హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ (సోమవారం) నుంచి బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహించనుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారని.. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు నిర్మల్‌లో ఈ యాత్రను ప్రారంభిస్తారని.. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుందని వెల్లడించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అభయ్‌ పాటిల్‌ కూడా దీనికి హాజరయ్యారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. అనంతరం ఏలేటి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడవడం లేదు. లారీలు లేవు, గన్నీ బ్యాగులు లేవు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించలేదు.. కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యమే దీనికి కారణం’ అని మండిపడ్డారు.

Updated Date - May 23 , 2026 | 05:22 AM