Share News

ఏ పార్టీతోనూ పొత్తులుండవు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:43 AM

తెలంగాణలో రాబోయేది డబుల్‌ ఇంజన్‌ సర్కారేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు చెప్పారు. భవిష్యత్తులో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవన్నారు. తాము సొంతంగానే...

ఏ పార్టీతోనూ పొత్తులుండవు

  • రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి వస్తాం

  • రాబోయేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే

  • 50 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌..

  • మహిళా బిల్లును ఎందుకు అమలు చేయలేదు?

  • ఖానాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాబోయేది డబుల్‌ ఇంజన్‌ సర్కారేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు చెప్పారు. భవిష్యత్తులో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవన్నారు. తాము సొంతంగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా అంకం మౌనిక బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ మహిళా బిల్లును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 400 మంది ఎంపీల బలమున్న సమయంలో సైతం రాజీవ్‌ గాంధీ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టలేకపోయారన్నారు. బిల్లును ప్రవేశపెట్టకపోగా ఒక వర్గం మహిళల కోసం చట్టాన్నే మార్చారని ఆరోపించారు. అదే వర్గం మహిళలకు అండగా నిలిచేందుకు ప్రధాని మోదీ ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశారని గుర్తు చేశారు. తలసరి ఆదాయాన్ని బట్టి సీట్లు కేటాయించాలని రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలు అర్థం లేనివన్నారు. రేవంత్‌రెడ్డిది నియంతృత్వ ధోరణి అని, పేదవాడు పేదవాడిగానే ఉండేలా ఆలోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ అన్నది బీజేపీ విధానమని.. ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో అది నిరూపితమైందని చెప్పారు. వైస్‌ చైర్మన్‌ పదవిని ఎవరికి ఇచ్చామో చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ వేర్వేరు కాదన్న విషయం మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి నిరూపితమైందని రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీలను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

Updated Date - Apr 14 , 2026 | 04:43 AM