Share News

కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వానికి ఏటీఎంలా తెలంగాణ

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:15 AM

కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంలా వినియోగించుకుంటోందని బీజేపీ శాసనసభా పక్షం ఉప నేత పాయల్‌ శంకర్‌ తీవ్రంగా విమర్శించారు.

కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వానికి ఏటీఎంలా తెలంగాణ

  • దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి డబ్బు మూటలు

  • సర్పంచుల పెండింగ్‌ బిల్లులు, రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల పట్ల నిర్లక్ష్యం

  • అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం

  • వందేమాతర గీతాన్ని అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలేవి?

  • బీజేఎల్పీ ఉపనేత పాయల్‌ శంకర్‌

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంలా వినియోగించుకుంటోందని బీజేపీ శాసనసభా పక్షం ఉప నేత పాయల్‌ శంకర్‌ తీవ్రంగా విమర్శించారు. పార్టీ జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి వందల కోట్ల డబ్బుల మూటలు పంపుతోందని ఆరోపించారు. ‘‘సర్పంచ్‌లకు పెండింగ్‌ బిల్లులు, రిటైర్డు ఉద్యోగుల బకాయిల చెల్లింపు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది... మరోవైపు కొంతమంది కాంట్రాక్టర్‌లకు రాత్రికి రాత్రి రెండు, మూడు వేల కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేస్తున్నారు. వారి నుంచి వచ్చే కమీషన్‌లను ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్‌కు అందిస్తున్నారు... ఢిల్లీ కాంగ్రెస్‌ తెలివైనది... అందుకే కేరళంలో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులనే పెద్దసంఖ్యలో ఇన్‌చార్జులుగా నియమించింది.’’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జె. సంగప్ప, కప్పర ప్రసాదరావు, ప్రభాగౌడ్‌తో కలిసి శంకర్‌ మాట్లాడారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బడ్జెట్‌ సమావేశాలు కనీసం 45 రోజులు జరగాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10 రోజుల్లోనే ఆ సమావేశాలను ముగించడం బాధాకరం... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.. అనేక సమస్యలను శాసనసభలో ప్రస్తావించడానికి ప్రయత్నించినా మా గొంతునొక్కే ప్రయత్నం జరిగింది. వందేమాతర గీతాన్ని అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్‌ చేశాం... వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్యానల్‌ స్పీకర్‌గా నియమించడం దేశానికి అవమానం.’’ అని పాయల్‌ శంకర్‌ విమర్శించారు.

Updated Date - Apr 01 , 2026 | 04:15 AM