రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దోపిడీ
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:05 AM
రాష్ట్రంలో పదేళ్లు బీఆర్‌ఎ్‌సకు, ప్రస్తుతం కాంగ్రె్‌సకు ప్రజలుఅధికారం ఇచ్చినా.. ఆయా పార్టీలు పరిపాలన సక్రమంగా చేయకుండా...
అధికారం అడ్డుపెట్టుకొని అక్రమాలు: రాంచందర్‌రావు
కొత్తగూడెం సాంస్కృతికం/నల్లగొండ/కోదాడ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదేళ్లు బీఆర్‌ఎ్‌సకు, ప్రస్తుతం కాంగ్రె్‌సకు ప్రజలుఅధికారం ఇచ్చినా.. ఆయా పార్టీలు పరిపాలన సక్రమంగా చేయకుండా అఽధికారాలను అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ఆదివారం కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగిన బహిరంగ సభలో.. నల్లగొండ జిల్లా కేంద్రంలో, సూర్యాపేట జిల్లా కోదాడలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో రాంచందర్‌రావు మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తామని ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చి వేసిందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, ఇంటింటికీ నీటి సరఫరా సహా ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలోకి తొక్కిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని, ఈ విషయాన్ని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకువస్తే.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలను ఇప్పటి వరకు అమలు చేయడం లేదని విమర్శించారు. రెండు పార్టీలు ప్రజల సొమ్ము దొచుకున్నవేనని ఆరోపించారు. ఒక పార్టీలో ఆస్తుల కోసం తగాదాలు ప్రారంభమయ్యాయని, మరో పార్టీలో ప్రజల సొమ్ము కోసం మంత్రులు తగదాలు పడుతున్నారని అన్నారు. సింగరేణి నిధులను పక్కదారి పట్టిచారని, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి సంస్థను నెట్టేసిన ఘనత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలదేనని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని రాంచందర్‌రావు విమర్శించారు.