మెట్రోలో వెళ్తా.. ఈవీలు కొంటా
ABN , Publish Date - May 15 , 2026 | 04:41 AM
ప్రధాని మోదీ సూచనల మేరకు తాను కూడా ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇస్తానని, అవసరమైన సందర్భాల్లో మెట్రో రైలులో వెళ్లి సమావేశాలకు హాజరవుతానని ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ సూచనల మేరకు తాను కూడా ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇస్తానని, అవసరమైన సందర్భాల్లో మెట్రో రైలులో వెళ్లి సమావేశాలకు హాజరవుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రకటించారు. ఒక నాయకుడి హోదాలో వివిధ కార్యక్రమాలకు వెళ్లాల్సివచ్చినప్పుడు తనతో పాటు సిబ్బంది కోసం మరో వాహనం వినియోగించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడున్న డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక స్వావలంబన-జాతీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ సూచించిన ‘సప్త సూత్రాలు’ అంశంపై గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. మోదీ సూచనలు రాజకీయ అంశాలు కావని, వాటిని సామాజిక, ఆర్థిక కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ స్వయంగా తన కాన్వాయ్‌లో 10 వాహనాలను తగ్గించుకుంటే.. రాష్ట్రంలో సీఎం రేవంత్ కూడా వాహనాలను కుదించుకోవడం మంచిపరిణామమని అన్నారు.