దేవుళ్లను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:53 AM
హిందూ దేవుళ్లను అవమానించినా, హిందువుల మనోభావాలను దెబ్బతీసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కోరారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
ఘనంగా జన్మదిన వేడుకలు
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 20 లక్షల విరాళం
తిరుమల, హైదరాబాద్ ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): హిందూ దేవుళ్లను అవమానించినా, హిందువుల మనోభావాలను దెబ్బతీసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నట్టు చెప్పారు. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రామచందర్‌రావు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్ చేతులమీదుగా ఈ విరాళం డీడీలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. మరోవైపు రామచందర్‌రావు జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు 67 కిలోల కేక్ కట్ చేశారు. కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు రామచందర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ వచ్చేనెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీఆర్‌ఎ్‌సలు ఇక దుకాణాలు బంద్ చేసుకోవాల్సిందే అని రామచందర్‌రావు చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పునకు మోదీ బీజం వేయబోతున్నారని ఆయన తెలిపారు.
తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. ‘నా జీవితంలో ఎన్నడు కూడా వేడుకలు చేసుకోలేదు. 2029లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే అసలయిన వేడుక. ఇది. ఆరంభం మాత్రమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక పార్టీ నాయకుడు అసెంబ్లీకి వచ్చినా, ఆయన సొంత పార్టీ ఆఫీసుకు వచ్చినా అది పెద్ద న్యూస్ అవుతోంది.’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా చల్లా రామకృష్ణారెడ్డి కోడలు చల్లా శ్రీలత బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో సమావేశమయ్యారు. రాంచందర్‌రావు సమక్షంలో ఆమె తండ్రి రాఘవేందర్‌రెడ్డి పార్టీలో చేరారు. తాను పార్టీలో చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్రీలత తెలిపారు.