Share News

గిరిజనుల భూ హక్కుల సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:51 AM

ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజనుల భూ హక్కుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చెప్పారు.

గిరిజనుల భూ హక్కుల సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌ సిటీ/ఉస్మానియా యూనివర్సిటీ, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజనుల భూ హక్కుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చెప్పారు. తమ భూములు, హక్కులు, జీవనాధారాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఇప్పటికీ పోరాటాలు చేయాల్సి వస్తుండటం బాధాకరమని, గిరిజనుల భూ హక్కులను రక్షించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమ్మక్క-సారలక్క సెంట్రల్‌ టైబ్రల్‌ యూనివర్సిటీ, గోపాల్‌ రావు స్మారక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప్‌సలోని ప్రొ.జి.రామ్‌ రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెమినార్‌ హాల్‌లో గిరిజన సెమినార్‌ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావు, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌. మాధవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ’గిరిజన సమాజ సమస్యలు, అభివృద్ధి అంశాలపై రాంచందర్‌రావు ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. భూముల కొనుగోలు, అమ్మకాలు, భూ హక్కుల పరిరక్షణ, గిరిజన భూములపై ఆక్రమణలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ గిరిజనుల అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 14 , 2026 | 04:51 AM