Share News

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:02 AM

కరీంనగర్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

  • ఒవైసీ సంతోషం కోసమే జీహెచ్‌ఎంసీ ముక్కలు

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంకు కరీంనగర్‌ ప్రజలు బుద్ధి చెప్పారు: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లపై కమలం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై కరీంనగర్‌లో తమ గెలుపును అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. ఓటుకు రూ.7వేల చొప్పున ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు అనేక కుట్రలు చేసినా వారి పాచిక పారలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బడే భాయ్‌ ఒవైసీ బ్రదర్స్‌ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. తొలిసారి కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేసి రికార్డు సృష్టించామని తెలిపారు. ఒవైసీ కళ్లలో ఆనందం కోసం రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి ఒక ముక్కను ఒవైసీకి రాసిచ్చారని ఆరోపించారు. కరీంనగర్‌ను ఐదేళ్లలో ఎలా అభివృద్ధి చేస్తామో చేసి చూపిస్తామన్నారు. కరీంనగర్‌ అభివృద్ధికి మోదీ సర్కారు రూ.1,500కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు నయా పైసా ఇవ్వలేదని గమనించిన ప్రజలు తమను ఆశీర్వదించారని చెప్పారు. కరీంనగర్‌లో 30 సీట్లు గెలిచామని, కొన్ని కారణాలతో ముగ్గురికి సీట్లు ఇవ్వలేకపోయినా, కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారని పేర్కొన్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు తమ వైపు వస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి రాబోతున్నామని మాజీ మేయర్‌ సునీల్‌రావుకు ఫోన్‌ చేసి చెబుతున్నారని సంజయ్‌ వెల్లడించారు.

Updated Date - Feb 14 , 2026 | 04:02 AM