Share News

మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌నుఅధిగమిద్దాం

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:54 AM

రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది.

మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌నుఅధిగమిద్దాం

  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం

  • బీజేపీ వ్యూహరచన.. కరీంనగర్‌, నిజామాబాద్‌పై నజర్‌

  • ఆ రెండు కార్పొరేషన్లతోపాటు వీలైనన్ని ఎక్కువ మునిసిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు

  • పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ

  • కొన్ని రోజులుగా క్షేత్ర స్థాయి నేతలతో వరుస భేటీలు

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వీలైనన్ని మునిసిపాలిటీల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ‘సేవ్‌ తెలంగాణ.. ఓట్‌ తెలంగాణ (బీజేపీ)’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల పర్యవేక్షణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ ఇన్‌చార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ షేలర్‌, కో ఇన్‌చార్జిలుగా అశోక్‌ పర్ణమి, రేఖా శర్మ నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వీరు పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. తాజాగా బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎనికల్లో పార్టీ కార్యాచరణపై ఈ కమిటీ దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్దేశించిన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సభ్యులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. మరోవైపు.. టికెట్ల కేటాయింపులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు అభ్యర్థుల ఎంపికపై జాతీయ, రాష్ట్ర స్థాయిలో రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌ శాతాన్ని పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలో ఎక్కువ విజయావకాశాలున్నాయని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. ప్రతి మునిసిపాలిటీకి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయించింది. కేంద్ర నేతల పర్యవేక్షణ, స్థానిక నేతల వ్యూహాలు, పక్కా సర్వే రిపోర్టులతో ఈ సారి అత్యధిక పురపాలికల్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Jan 30 , 2026 | 03:54 AM