రాష్ట్ర ప్రభుత్వం కోరితే..సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధం
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:21 AM
సింగరేణి, నైనీ బొగ్గు టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 22(ఆంధ్రజ్యోతి): సింగరేణి, నైనీ బొగ్గు టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరు, సభ్యులకు అప్పగించిన బాధ్యతలతో పాటు 4 నెలల పార్టీ కార్యకలాపాలను సమీక్షించారు. రానున్న మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే అనుబంధ విభాగాల పనితీరుపై కూడా సమీక్షించారు. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో, అనే విషయాలు ప్రజలకు తెలపాలన్నారు. రెండు సార్లు దావోస్ పర్యటనల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.