ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - May 24 , 2026 | 04:40 AM
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. అసాధారణ జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని....
రేపటి నుంచి రైతు భరోసా యాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. అసాధారణ జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, కొనుగోళ్ల ప్రక్రియను తక్షణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మక్క, జొన్నతో పాటు ఇతర పంటలను కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి, రైతులను మోసం చేస్తున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. ‘ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ బీఆర్‌ఎస్ పాలనను ప్రజలు చూశారు.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా కొత్త ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లకు డీపీఆర్‌లు తయారు చేస్తూ, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆరోపించారు. కాగా సోమవారం నుంచి ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ పేరిట పార్టీ 3 రోజుల బస్సు యాత్ర’ నిర్వహించనుంది. ఇందులో రాంచందర్‌రావు, రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి తాండూరు మార్కెట్ సెంటర్‌కు చేరుకుని రైతులతో సమావేశమవుతారు. మంగళవారం గజ్వేల్, భువనగిరి, వరంగల్‌లో., బుధవారం భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలోనూ రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు.