Share News

మంత్రుల్లో ఎవరెవరు బీఆర్‌ఎస్‌ నేతల వద్ద ఉంటున్నారో చూసుకోండి

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:17 AM

కాంగ్రెస్‌ పార్టీది హిట్లర్‌ మనస్తత్వం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు విమర్శించారు. రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థల మీద ఆ పార్టీకి నమ్మకం లేదని విమర్శించారు.

మంత్రుల్లో ఎవరెవరు బీఆర్‌ఎస్‌ నేతల వద్ద ఉంటున్నారో చూసుకోండి

  • కాంగ్రెస్‌ పార్టీది హిట్లర్‌ మనస్తత్వం

  • హిట్లర్‌లా వ్యవహరించే పార్టీకి చావు తప్పదు

  • సీఎం రేవంత్‌కు బీజేపీ భయం పట్టుకుంది

  • ప్రధాని సభతో రేవంత్‌లో అసహనం.. ఆందోళన

  • మా పార్టీ ఆఫీసు ఎదుట పోసేందుకు ఎన్ని బస్తాల ధాన్యం తెస్తారో తెండి: రాంచందర్‌ రావు

హైదరాబాద్‌,జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీది హిట్లర్‌ మనస్తత్వం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు విమర్శించారు. రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థల మీద ఆ పార్టీకి నమ్మకం లేదని విమర్శించారు. హిట్లర్‌ మాదిరిగా వ్యవహరించే పార్టీకి చావు తప్పదన్నారు. బీజేపీ అంటే సీఎం రేవంత్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉదయం బీజేపీ, మధ్యాహ్నం బీజేపీ, రాత్రి బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ పేర్లు తప్ప మరో అంశం మాట్లాడటం లేదు. ప్రధాని మోదీ సభ విజయవంతమయ్యాక వచ్చిన నివేదికలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందనే విషయం సీఎంకు స్పష్టమైంది. అందుకే బీజేపీపై ఆయనలో అసహనం, ఆందోళన పెరిగింది.’ అని పేర్కొన్నారు. సోమవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎ్‌సతో టచ్‌లో ఉన్నారంటూ సీఎం రేవంత్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ‘అసలు ఎంతమంది మీ మంత్రులు ప్రతిరోజు బీఆర్‌ఎస్‌ నాయకుల వద్ద ఉంటున్నారో ముందు చూసుకోండి’ అని రేవంత్‌కు సూచించారు. తమ పార్టీ కార్యాలయం ముందు ఎన్ని లారీలు ధాన్యం వేస్తారో వేయండి చూస్తాం అంటూ రేవంత్‌కు సవాల్‌ చేశారు. సీఎం రేవంత్‌, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ అపాయింట్‌మెంట్‌ కోరితే కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ రేవంత్‌ చెప్పిన మాట అబద్ధమని పేర్కొన్నారు. ఈ విషయమై తాము మహారాష్ట్ర సీఎంవోను సంప్రదించగా, తెలంగాణ సీఎంవో నుంచి అపాయింట్‌మెంట్‌ కోరలేదని సమాధానం వచ్చిందని చెప్పారు. రీజినల్‌ రింగ్‌రోడ్డుకు కేంద్రం రూ. 500కోట్లు ఇచ్చిందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం, పాలమూరు-రంగారెడ్డి, మూసీ ప్రాజెక్టును రెండు ఏటీఎంలుగా మార్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ‘ఎవరి జాగీరని మీరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను కర్ణాటకకు ఇస్తున్నారు’ అని సీఎంను నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌, చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌, హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ అంటూ అనేక హామీలు ఇచ్చారని.. వాటి అమలుపై కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘‘డిక్లేర్‌ అండ్‌ ఫర్గెట్‌’’ విధానంతో ముందుకు వెళ్తోంది. ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీపై ఎంత బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజల్లో పార్టీ అంతగా బలపడుతుందని పేర్కొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 04:17 AM