BJP Telangana President N. Ranchandra Rao: పథకాల పేర్లపై కాంగ్రెస్ రాజకీయం
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:07 AM
పథకాల పేర్లపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. మన్‌రేగాకి ముందు గ్రామీణ ఉపాధి పథకాలు జవహర్ రోజ్‌గార్ యోజన, ఫుడ్ ఫర్ వర్క్ వంటి పేర్లతో ఉండేవని...
సుమారు 600 పథకాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టిందే ఆ పార్టీ
వీబీ-జీరామ్‌జీపై అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాన్ని ఖండిస్తున్నాం..
కవిత పార్టీతో మాకొచ్చే నష్టమేమీ లేదు: ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పథకాల పేర్లపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. మన్‌రేగాకి ముందు గ్రామీణ ఉపాధి పథకాలు జవహర్ రోజ్‌గార్ యోజన, ఫుడ్ ఫర్ వర్క్ వంటి పేర్లతో ఉండేవని, 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వం నుంచి 2004లో మన్మోహన్ సింగ్ సర్కారు వచ్చే వరకు పథకాల పేర్లు మారాయని చెప్పారు. ఇన్ని సార్లు పేరు మార్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం పేర్లపై రాజకీయం చే స్తోందని దుయ్యబట్టారు. గృహ పథకాలకు, అవార్డులకు.. ఇలా దేశంలో సుమారు 600 పథకాలకు ఒకే కుటుంబం పేర్లను కాంగ్రెస్ పెట్టిందని విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహానుభావులను కాంగ్రెస్ రెండో తరగతి నాయకుల్లా చూసిందని మండిపడ్డారు. నిజంగా మహాత్మా గాంధీపై కాంగ్రె్‌సకు ప్రేమే ఉంటే.. ఆనాడు విమానాశ్రయాలు, పథకాలకు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల పేర్లే ఎందుకు పెట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం తెచ్చిన వీబీ-జీరామ్‌జీ యాక్ట్-2025ను వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ పథకంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, నాయకులకు అవినీతి చేసే అవకాశం ఉండదని.. అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ అంశంపై రాంచందర్‌రావు స్పందించారు. ‘కే.ఏ పాల్ కూడా పార్టీ పెట్టారు.. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కవిత పార్టీ పెట్టడం వల్ల మాకు వచ్చే నష్టమేమి లేదు. ముందు ఆమె చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరపాలి. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం..’ అని స్పష్టం చేశారు. ఇటు రాంచందర్ రావు అధ్యక్షతన బూత్ నిర్మాణ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యశాల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వచ్చే మునిసిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు.