బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో ఉద్రిక్తత
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:20 AM
బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్‌పీ ఓసీపీ, ఎస్‌ఆర్‌పీ-3 గనులను పరిశీలించేందుకు బీజేపీ.....
గనుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట
వెనుతిరిగిన బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి బృందం
శ్రీరాంపూర్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్‌పీ ఓసీపీ, ఎస్‌ఆర్‌పీ-3 గనులను పరిశీలించేందుకు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గనుల్లోకి వెళ్లనీయకపోవడంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కాషాయ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. ఆ తర్వాత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విలేకరుల సమాశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో అనేక అక్రమాలు జరిగి వేలకోట్ల రూపాయలు దోచుకుంటే తాము అధికారంలోకి వస్తే విచారణ చేయించి శిక్ష పడేలా చూస్తామని నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి చెప్పారని, అధికారంలోకి రాగానే విచారణ వదిలేసి దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంధన శాఖ మంత్రిగా సింగరేణిని తన జేబు సంస్థగా మార్చుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడంలేదని, హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ టాక్సులు, వి టాక్సులు, యూ టాక్సుల పేరుతో అనేక కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ సింగరేణిపై పడి దోచుకుంటున్నారని ఏలేటి ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ.51,500 కోట్లు బకాయి పడిందన్నారు. ఈ డబ్బు ఇచ్చి ఉంటే కార్మికులకు నూతన క్వార్టర్లు, పిల్లలకు ఉత్తమ విద్య, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, రక్షణ పరికరాలు, నూతన యంత్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉండేదన్నారు. 107 మెగావాట్ల సోలార్ విద్యుత్ పేరిట స్కామ్‌లు చేస్తున్నారని, రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేశారని, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని ఏలేటి ప్రశ్నించారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, సిర్‌పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరి్‌షబాబు, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పాల్గొన్నారు.