దేశాన్ని బీజేపీ అమెరికాకు తాకట్టు పెడుతోంది
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:48 AM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని, దేశ ప్రజలు తలదించుకునేలా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్ ఆరోపించారు.
ప్రజలంతా తలదించుకునేలా వ్యవహరిస్తోంది
అమెరికాతో ట్రేడ్ డీల్‌ను రద్దు చేయాలి
ట్రేడ్ డీల్‌కు వ్యతిరేక ధర్నాలో మహేశ్‌గౌడ్
అమెరికా వాణిజ్య డీల్‌తో మన రైతులకు తీవ్ర నష్టం: చిబ్
కవాడిగూడ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని, దేశ ప్రజలు తలదించుకునేలా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మిస్తే బీజేపీ తాకట్టు పెడుతోందని విమర్శించారు. శనివారం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆఽధ్వర్యంలో ‘మోదీ తలవంచితే దేశం తలవంచదు’ అన్న నినాదంతో.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌గౌడ్, ఆలిండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిబ్, మంత్రి సీతక్క తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చిబ్ అన్నారు. వెంటనే ఆ డీల్‌ను రద్దు చేసుకోవాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలు తమ పోరాటాన్ని ఉధృతం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూసిన బీజేపీకి ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీసీ అధ్యక్షుడు ఖర్గే, మిగతా విపక్షాలు పార్టమెంటులో తగిన బుద్ధి చెప్పారన్నారు. దేశ ప్రజలను కులాలు, మతాల ప్రాతిపదికన విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు.