Share News

కరీంనగర్‌ మేయర్‌ బీజేపీదే!

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:17 AM

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీజేపీ తొలిసారిగా ఒక నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ను గెలుచుకుంది. బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్‌, యాదగిరి సునీల్‌రావు మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు.

కరీంనగర్‌ మేయర్‌ బీజేపీదే!

  • తెలంగాణలో బీజేపీకి దక్కిన తొలి కార్పొరేషన్‌ .. బీఆర్‌ఎ్‌సతో కలిసి గెలిచేందుకు కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నం

  • మిగతా సభ్యుల్ని కూడగట్టిన మంత్రులు

  • చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన బీఆర్‌ఎస్‌

  • మేయర్‌గా శ్రీనివాస్‌, డిప్యూటీగా సునీల్‌

  • ఫలించిన కేంద్ర మంత్రి సంజయ్‌ తంత్రం

కరీంనగర్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీజేపీ తొలిసారిగా ఒక నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ను గెలుచుకుంది. బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్‌, యాదగిరి సునీల్‌రావు మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ నాయకత్వంలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో గట్టి పోరాటం చేసిన బీజేపీ 66 డివిజన్లలో ఏకంగా 30 గెలుచుకొని మేయర్‌ స్థానాన్ని దాదాపుగా పదిలం చేసుకుంది. అయితే, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, స్వతంత్ర కార్పొరేటర్లను కలుపుకొని కూటమిగా మేయర్‌ పోస్టును దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ఆదివారం వరకు గట్టి ప్రయత్నాలే చేసింది. మంత్రులను మోహరించింది. బీజేపీ వైపు వెళ్లిపోయిన స్వతంత్రులను కూడా తనవైపు తిప్పుకుంది. బీఆర్‌ఎ్‌సకు సంకేతాలు పంపింది. స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు కూడా అందుకు అనుకూలంగా పావులు కదిపినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. రెండు పార్టీలు కలిసి పని చేయడంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడాన్ని గమనించిన బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం సోమవారం మేయర్‌ ఎన్నిక ఎన్నికకు దూరంగా ఉండాలని తన కార్పొరేటర్లను ఆదేశించింది. దాంతో మేయర్‌ పదవిని దక్కించుకోవాలన్న కాంగ్రెస్‌ పథకం బెడిసికొట్టింది. సోమవారం ఎన్నికైన కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. బీజేపీ కొలగాని శ్రీనివాస్‌, యాదగిరి సునీల్‌రావులను బరిలో నిలిపింది. కార్పొరేషన్‌ పరిధిలో 66 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు.


బీజేపీకి అనుకూలంగా 30 మంది కార్పొరేటర్లు, ముగ్గురు స్వతంత్రులు, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎంపీ బండి సంజయ్‌ ఓటు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఆకుల నర్మద, హీనా ఆఫ్రీన్‌లను ప్రతిపాదించారు. 14 మంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, ముగ్గురు ఎంఐఎం కార్పొరేటర్లు, నలుగురు స్వతంత్రులు వీరికి అనుకూలంగా ఓటేశారు. డిప్యూటీ మేయర్‌కు ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఓటు అదనంగా పడింది. 34 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థులకు 21, 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థులను మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు గంగుల కమలాకర్‌ సమావేశానికి హాజరు కాలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ సమావేశానికి హాజరైనా తన ఓటును వినియోగించుకోలేదు.


ఎన్నికకు ముందు నాటకీయ పరిణామాలు

66 డివిజన్ల కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 30 డివిజన్లు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, ఎంఐఎం 3, ఫార్వార్డ్‌ బ్లాక్‌ 2, స్వతంత్రులు 8 స్థానాలు గెలుచుకున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. మేయర్‌ ఎన్నికకు మొత్తం 69 మంది ఓటర్లు అయ్యారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ల విజయానికి 35 మంది బలం కావాలి. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యంరాకపోవడంతో స్వతంత్రులు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్పొరేటర్ల మద్దతు కీలకంగా మారింది. డివిజన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ఒక స్వతంత్ర సభ్యుడిని, మరో ఫార్వర్డు బ్లాక్‌ సభ్యురాలిని బీజేపీలో చేర్చుకున్నారు. మర్నాడు 17, 39 డివిజన్‌ కార్పొరేటర్లు వేముల కవిత చంద్రశేఖర్‌, మాసం గణేశ్‌ బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. దాంతో బీజేపీబలం 34కు, ఎంపీ బండి సంజయ్‌ ఓటుతో కలుపుకొని 35కు చేరింది. అప్పుడే కాంగ్రెస్‌ రంగ ప్రవేశం చేసింది. తమ సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్రులు, ఒక ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యుడితో క్యాంపు ప్రారంభించింది. తర్వాత మరో ఇద్దరు స్వతంత్రులు వచ్చి క్యాంపులో చేరారు. ఇద్దరు సభ్యులున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకత్వం తమ కార్పొరేటర్లకు సమావేశానికి రావాలని విప్‌ జారీ చేసింది. ఎవరికి ఓటు వేయాలో మరో విప్‌ జారీ చేస్తామని, ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలుంటాయని హెచ్చరింది. క్యాంపుల్లో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ఆదివారం విప్‌ నోటీసులు అంటించింది. దాంతో బీజేపీ క్యాంపులో ఉన్న 15వ డివిజన్‌ ఫార్వర్డ్‌ బ్యాక్‌ కార్పొరేటర్‌ సాయిజ్యోతి కూడా కాంగ్రెస్‌ క్యాంపునకు వెళ్లారు.


బీఆర్‌ఎస్‌ కూడా మద్దతు పలికితే కాంగ్రెస్‌ బలం 35కు చేరినట్లే. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, ఎంఐఎం 3, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2, స్వతంత్రులు ఐదుగురు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇద్దరు.. ఇదీ వేసుకున్న లెక్క. అనుకున్నట్లు అన్నీ సజావుగా జరిగితే అధికారం వారి పరమయ్యేది. కాంగ్రెస్‌ కూటమి ప్రయత్నాలతో అప్రమత్తమైన బండి సంజయ్‌ మీడియా ముందు తన క్యాంపు ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. తమకు ప్రజలు పట్టం కట్టినా అధికారం దక్కనీయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు వ్యతిరేకంగా మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

Updated Date - Feb 17 , 2026 | 07:17 AM