అప్పట్లో రేవంత్‌ను కేసీఆర్ కాపాడితే..
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:41 AM
కేంద్ర సర్కారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు ఎన్ని నిధులిచ్చిందనేది తాము చెబుతామని.. జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిధుల కేటాయింపు వివరాలు చెప్పగలరా...
ఇప్పుడు కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నారు!
బీఆర్‌ఎ్‌సతో స్నేహం లేకపోతే కాళేశ్వరం అవినీతిపైనే సీబీఐ విచారణను కోరాలి
జిల్లాల వారీగా కేటాయించిన నిధులు చెప్పగలరా?: రాంచందర్‌రావు
మునిసిపోల్‌పై బీజేపీ మేనిఫెస్టో విడుదల
రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్ పోటీ: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నర్సాపూర్, ఆమనగల్లు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సర్కారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు ఎన్ని నిధులిచ్చిందనేది తాము చెబుతామని.. జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిధుల కేటాయింపు వివరాలు చెప్పగలరా? అని సీఎం రేవంత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్ చేశారు. జిల్లాలవారీగా నిధుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించే అవకాశమే లేదని.. ఎందుకంటే ఆ నిధులన్నీ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో కమీషన్ల రూపేణా కాంగ్రెస్ నాయకులే పరస్పరం ఇచ్చుకున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ సర్కారూ ఇలాగే చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును సీబీఐకి ఇవ్వాలని తామే డిమాండ్ చేశామని చెప్పారు. బీఆర్‌ఎ్‌సతో స్నేహం లేకపోతే మొత్తం కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని రేవంత్‌కు సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను అప్పటి సీఎం కేసీఆర్ కాపాడరని, ఇప్పుడు కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మునిసిపల్ ఎన్నికల మేనిఫెస్టోను రాంచందర్‌రావు విడుదల చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులను తమ కార్యకర్తలుగా కాంగ్రెస్ వినియోగించుకుంటోందని ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినా, ఇళ్లపై దాడులు చేసినా ఊరుకోబోమని ప టోలీసులను హెచ్చరించారు. రేవంత్ తమ వెనుక ఉన్నారని పోలీసులు అనుకోవొద్దని.. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉందని, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని మత విద్వేషాల ప్రసంగాల నియంత్రణ బిల్లును కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఆ బిల్లును రేవంత్ సర్కారు తీసుకురాబోతోందని చెప్పారు. ఈ బిల్లును ఆమోదిస్తే, మొదటి కేసు సీఎం రేవంత్‌పై నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మునిసిపాలిటీల్లో తాము అధికారంలోకి రాగానే అవినీతిరహిత పాలన అందిస్తామని, మోడల్ మునిసిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
రేవంత్‌ది నియంతృత్వ పోకడ
తెలంగాణను దోచుకోవడంలో బీఆర్‌ఎ్‌సతో కాంగ్రె స్ పోటీ పడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలు అని.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీని మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దోచుకుందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో శుక్రవారం బీజేపీ మునిసిపాలిటీ అభ్యర్థులకు మద్దతుగా కిషన్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం స్థానిక రాజీవ్ చౌక్‌వద్ద హైదరాబాద్ - శ్రీశై లం జాతీయ రహదారిపై జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లి్‌సకు బానిసలని, అధికారం కోసం మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయని ఆరోపించారు. గతంలో కేసీఆర్ అవలంబించిన నియంతృత్వ పోకడలనే సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన హామీలివే
మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఇంటిపన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండబోదు.
అర్హత కలిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లను స్మార్ట్‌సిటీలుగా ప్రకటించేందుకు కేంద్రాన్ని ఒప్పిస్తాం.
ప్రతి వార్డు, డివిజన్‌లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి.. చౌకధరల్లో మందులు.
ఆన్‌లైన్, సింగిల్ విండో విదానం ద్వారా వారంలో ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు.
మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వందశాతం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ.
ఆలయాల పరిరక్షణ, కబ్జాల నుంచి ఆలయ భూముల విముక్తి, గోశాలల ఏర్పాటు.