Share News

‘కాళేశ్వరం’ పునరుద్ధరణలో సర్కారు విఫలం

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:52 AM

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు.

‘కాళేశ్వరం’ పునరుద్ధరణలో సర్కారు విఫలం

ఎన్‌డీఎస్ఏ సిఫారసులను అమలు చేయలేదేం?

కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరడం లేదేం?

సీఎంకు బహిరంగ లేఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్న

హైదరాబాద్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడచిపోయినా జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ ) సిఫారసులను ఎందుకు అమలు చేయలేదని ఆయన సీఎం రేవంత్‌ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ సిఫారసులను అమలు చేయకపోవడం వల్లే సాగు, తాగునీటి సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రాజెక్టు జియోటెక్నికల్‌, జియోఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్‌, హైడ్రాలిక్‌ డిజైన్‌ పరీక్షలు నిర్వహించాలని రెండేళ్ల కిందట ఎన్‌డీఎస్ఏ సిఫారసు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే మూడు బ్యారేజీలను వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పునరుద్ధరించడం పోయి సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. విజిలెన్స్‌ కమిషన్‌, జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో కుమ్మక్కవడం వల్లే ఆయా కమిషన్ల సిఫారసులను అమలు చేయడం లేదని ఆరోపించారు. విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసులను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌డీఎస్ఏ , సీడబ్ల్యూసీ వంటి సంస్థలు ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక అంశాలపై మాత్రమే దిశానిర్దేశం చేస్తాయని వివరించారు. సీఎం రేవంత్‌ మాత్రం మొత్తం ప్రాజెక్టు పునరుద్ధరణ బాధ్యత ఎన్‌డీఎస్ఏ పై నెట్టివేసేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు. ‘బ్యారేజీలకు ప్రమాదం తలెత్తకుండా ఉండాలంటే గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి నుంచి పంపింగ్‌ చేయవచ్చని నిపుణులు స్పష్టం చేశార’ని పేర్కొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 04:53 AM