Share News

ఇళ్లు కూల్చకుండా ఎన్ని విగ్రహాలైనా పెట్టుకో..

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:17 AM

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పేరిట పేదల ఇళ్లు కూల్చొద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు సూచించారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ....

ఇళ్లు కూల్చకుండా ఎన్ని విగ్రహాలైనా పెట్టుకో..

  • ప్రజలకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోం

  • గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు అంశంలో సీఎం రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరిక

  • గాంధీ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టత

నార్సింగ్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పేరిట పేదల ఇళ్లు కూల్చొద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు సూచించారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ఎన్ని విగ్రహాలైన పెట్టుకొమ్మని హితవు పలికారు. అలా కాకుండా ఒక్క ఇల్లు కూల్చినా బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బాపూఘాట్‌ నుంచి మధుపార్క్‌, హైదర్షాకోట్‌, భైరాగీగూడ నుంచి గండిపేట చెరువు వరకు మూసీ వెంట పర్యటించారు. గండిపేట వద్ద విలేకరులతో మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళన చేయకుండా గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేయాలని చూస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. దమ్ముంటే మూసీ ప్రక్షాళన చేసి చూపాలని సవాల్‌ విసిరారు. మూసీలో ఒక్క చుక్క మురుగునీరు కలవకుండా చూడాలని అన్నారు. మూసీ సరోవర్‌ ప్రాజెక్టు పేరుతో పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నా, ఏ ఒక్కరికి ఆయన పరిహారం ఇచ్చే పరిస్థితిలో లేరని విమర్శించారు. ఇక్కడ ఎకరం రూ.150 కోట్లకు అమ్ముడవుతుండగా.. ఇంతమందికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారని, పునరావాసం అసాధ్యమని పేర్కొన్నారు. గాంధీ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజలకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఇక, గాంధీ సరోవర్‌ విషయంలో ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమంతో పాటు న్యాయపోరాటం కూడా చేస్తామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. భూములు కోల్పోతున్న బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడించారు.

Updated Date - Feb 27 , 2026 | 04:17 AM