Share News

అది జోడో యాత్ర కాదు.. విభజించే యాత్ర

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:37 AM

రాహుల్‌ గాంధీ చేపట్టింది భారత్‌ జోడో యాత్ర కాదని, రాజకీయంగా దేశాన్ని విభజించే యాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు విమర్శించారు.

అది జోడో యాత్ర కాదు.. విభజించే యాత్ర

  • దేశాన్ని విభజించేలా కాంగ్రెస్‌ పార్టీ చర్యలు

  • 10న జన ఆగ్రహ సభలో పాల్గొననున్న మోదీ

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ చేపట్టింది భారత్‌ జోడో యాత్ర కాదని, రాజకీయంగా దేశాన్ని విభజించే యాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ చర్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించతలపెట్టిన సభ పోస్టర్‌ను బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా మోదీ సభకు ‘‘జన ఆగ్రహ సభ’’ గా నామకరణం చేశామని వెల్లడించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, వివిధ అంశాలపై బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో విస్తృతంగా చర్చించామని తెలిపారు. హైదరాబాద్‌లో రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే జన ఆగ్రహ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మొదటి సారి రాష్ట్రానికి విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. సభకు మేధావులు, యువత, మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ విజయం తథ్యమని రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Updated Date - Apr 30 , 2026 | 04:37 AM