President N. Ranchandra Rao: ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్‌చార్జ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:09 AM
త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీకి ఇన్‌చార్జులను నియమించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు.
రానున్న పుర ఎన్నికలకు సమాయత్తమైన బీజేపీ
ఎన్నికల సమన్వయానికి ప్రత్యేక కమిటీ
బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టేలా ప్రణాళికలు
రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్ర జ్యోతి) : త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీకి ఇన్‌చార్జులను నియమించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించారు. జీహెచ్‌ఎంసీ విస్తరణ, పురపాలక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలను బూత్ స్థాయి నుంచి ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా, పథకానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాలని కూడా పదాధికారుల సమావేశంలో చర్చించారు. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పార్టీ కార్యాచరణపై దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్‌పాటిల్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ రానున్న రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతంరావు, వేముల అశోక్, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.