Share News

నేడు రాష్ట్రానికి నితిన్‌ నబీన్‌

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:14 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకు ఆదివారం రానున్నారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అధికార పీఠం....

నేడు రాష్ట్రానికి నితిన్‌ నబీన్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకు ఆదివారం రానున్నారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అధికార పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పర్యటన కొనసాగించనున్న నితిన్‌ నబీన్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒకవైపు పార్టీ శ్రేణులతో మరోవైపు వివిధ వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే సమావేశానికి ‘విజయ సంకల్ప సమ్మేళనం’గా పార్టీ నామకరణం చేసింది. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని సుమారు 15 వేల మంది పోలింగ్‌ బూత్‌ల అధ్యక్షులు, ఏజెంట్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వారిని ఉద్దేశించి నితిన్‌ నబీన్‌ మాట్లాడతారు. సోమవారం వీబీఐటీ కాలేజీలో ‘యువ సమ్మేళనం’లో ఆయన పాల్గొంటారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని వరంగల్‌లో గిరిజనులతో భేటీ అవుతారు. అనంతరం పోలింగ్‌ బూత్‌ల అధ్యక్షుల సమావేశానికి హాజరవుతారు. మంగళవారంఘట్‌కేసర్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్‌ నబీన్‌.. 4 గంటలకు రంగారెడ్డి రూరల్‌ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని, వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన 9 ఇతర జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసివచ్చినా బీజేపీని అడ్డుకోలేవు: రాంచందర్‌రావు

నితిన్‌ నబీన్‌ రాష్ట్ర పర్యటన చరిత్రాత్మకం కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత విస్తరణకు ఆయన పర్యటన కీలకం అవుతుందని చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘నితిన్‌ నబీన్‌ గతంలో ఒకసారి రాష్ట్రానికి వచ్చినా సంస్థాగత అంశానికి సంబంధించి ఆయన తొలిసారిగా ఆదివారం ఇక్కడకు వస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర పార్టీ బలోపేతానికి ఆయన పర్యటన ఆరంభం కాబోతోందని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంకలిసివచ్చినా బీజేపీని అడ్డుకోలేవన్నారు. ఆ మూడు పార్టీల అసలు నైజాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని, బీజేపీనే ప్రత్యామ్నాయంగా వారు భావిస్తున్నారని చెప్పారు. కాగా, ఎయిర్‌లైన్స్‌ రంగానికి చెందిన ప్రముఖులు హరికృష్ణన్‌, చంద్రమోహన్‌ బీజేపీలో చేరారు. రాంచందర్‌రావు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Jun 28 , 2026 | 03:14 AM