Share News

నయా నిజాం సీఎం రేవంత్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:04 AM

సీఎం రేవంత్‌ నయా నిజాం అవతారం ఎత్తి రాష్ట్రంలో ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.

నయా నిజాం సీఎం రేవంత్‌

  • ఢిల్లీకి కప్పం కట్టేందుకే మంత్రివర్గ భేటీలు

  • బాన్సువాడ ఘటనలో ఓ వర్గానికి మద్దతు:ఎంపీ లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ నయా నిజాం అవతారం ఎత్తి రాష్ట్రంలో ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. బాన్సువాడలో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్‌ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్‌ అని గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేస్తూ ఆయన ముస్లింలకు కొమ్ముకాస్తున్నారని దీనిబట్టి స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ ఆలీ తన రాజకీయ ఉనికి కోసం దాడికి పురికొల్పారని ఆరోపించారు. హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బూతు పురాణాలతో కాలం వెళ్లదీస్తూ ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. మంత్రివర్గ భేటీల్లో గ్యారెంటీలు, ప్రభుత్వ పథకాల అమలకు కావాల్సిన నిధుల కేటాయింపులపై ఆలోచించకుండా భూములపై చర్చలు జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మంత్రివర్గ సమావేశాలను తూతూమంత్రంగా నడిపిస్తూ ఢిల్లీకి కప్పం కట్టేందుకు కావాల్సిన వనరుల కోసమే చర్చలు జరుపుకొన్నారని ఆరోపించారు. అవినీతిలో పంపకాల తగాదాలు, వివాదాల పరిష్కారం కోసమే ఈ సమావేశాలు జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు.

Updated Date - Feb 25 , 2026 | 02:04 AM