పునర్విభజనపై విషం చిమ్మడం దుర్మార్గం
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:54 AM
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పునర్విభజనపై రేవంత్‌రెడ్డి విషం...
డీలిమిటేషన్‌ను ప్రశ్నిస్తున్న రేవంత్ జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు ఎలా చేశారు?
జీడీపీ ఆధారంగా పునర్విభజన చేయాలన్న ప్రతిపాదనను చూసి దేశమంతా నవ్వుకుంటోంది
పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరగదు: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పునర్విభజనపై రేవంత్‌రెడ్డి విషం చిమ్మడం దుర్మార్గమని మండిపడ్డారు. జీఎ్‌సడీపీ ఆధారంగా పునర్విభజన చేపట్టాలని సీఎం రేవంత్ చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ అధికారిక విధానమా? అని ప్రశ్నించారు. రాహుల్, ఖర్గే దీనిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడైనా జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుందన్నారు. ఆదాయం ఆధారంగా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, రేవంత్ ప్రతిపాదనను చూసి దేశమంతా నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. ‘‘డీలిమిటేషన్‌ను ప్రశ్నిస్తున్న రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని ఏ ప్రాతిపదికన మూడు ముక్కలు చేశారు? విభజన చేసే ముందు ఎవరితో చర్చించారు? ఒక్క అఖిలపక్ష సమావేశమైనా నిర్వహించారా? అసెంబ్లీలోనైనా చర్చ జరిపారా? కనీసం ప్రజల అభిప్రాయాలనైనా పరిగణనలోకి తీసుకున్నారా?’’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గురువారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ చెప్పిన ‘ఒక వ్యక్తి- ఒక ఓటు- ఒకే విలువ’ అనే సూత్రానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికరణల ప్రకారం డీలిమిటేషన్‌కు జనాభా లెక్కలే ప్రాతిపదిక అని, జీఎస్డీపీ ఆధారంగా సీట్లు కేటాయించాలనడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ‘ప్రజల కోసం’ నుంచి ‘డబ్బు కోసం’ అనేలా మార్చే ప్రమాదకరమైన ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని అశాస్త్రీయంగా 300 డివిజన్లుగా విభజించడం వెనక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం, మజ్లిస్ ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీని ముక్కలు చేశారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని లక్ష్మణ్ విమర్శించారు. మహిళల అవకాశాలను తొక్కేయాలని చూస్తోందన్నారు. సీట్లు పెరిగితే ఎస్సీ, ఎస్టీలకూ ప్రాతినిధ్యం పెరుగుతుందని, దాన్నీ కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు.