Share News

మతపరమైన రిజర్వేషన్లు వద్దు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:58 AM

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఓబీసీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

మతపరమైన రిజర్వేషన్లు వద్దు

  • అలాంటి రిజర్వేషన్లపై సమీక్ష జరగాలి: ఎంపీ లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఓబీసీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఓటు బ్యాంక్‌ రాజకీయాల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కల్పిస్తున్నాయన్నారు. సోమవారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడారు. తెలంగాణలో గతంలో ఓబీసీ జాబితాలోని ముస్లింలకు కాకుండా మిగతా ముస్లింల కోసం ప్రత్యేకంగా 4శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. దీన్ని గతంలో హైకోర్టు కొట్టివేసినప్పటికీ ఆ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలే ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. మత ప్రాతిపదికన కల్పిస్తున్న ఇలాంటి రిజర్వేషన్లపై సమగ్రంగా సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్‌ వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ఏపీ హైకోర్టు గతంలో ముస్లిం రిజర్వేషన్లను కొట్టివేసిందని.. ఓబీసీ కేటగిరీ హిందువుల కోసమేనని, కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులమతాల ప్రాతిపదికన విడగొట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాగా, విపక్షాలు పోటీపడి ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడుతున్నాయని మీడియాతో ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 05:58 AM